Share News

Dog Obstruction: నలుగురిని బలిగొన్న శునకాలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 03:55 AM

బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద, అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

Dog Obstruction: నలుగురిని బలిగొన్న శునకాలు

  • ‘మార్టూరు’లో కారుకు అడ్డుగా రావడంతో ప్రమాదం

  • వృద్ధ దంపతులతోపాటు మనవడి మృతి

  • కుమారుడు, కోడలికి తీవ్ర గాయాలు

  • కనిగిరి వద్ద మరో ఘటన.. కుక్క అడ్డొచ్చి బైకిస్టు దుర్మరణం

  • మృతుడు ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు

  • రెండ్రోజుల్లో ఆస్ర్టేలియా బయలుదేరనుండగా మృత్యువాత

మార్టూరు, కనిగిరి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద, అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు ఘటనల్లోనూ శునకాలు అడ్డురావడంతో వాహనాలు అదుపతప్పి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలివీ.. తిరుపతిలోని పోస్టల్‌ కాలనీ నివాసి అయిన దామర్ల లక్ష్మయ్య రేడియేటర్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు. మహాలయ అమావాస్యకు కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటిలింగాల క్షేత్రంలో శాంతి కార్యక్రమం కోసం ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి కారులో శనివారం రాత్రి బయల్దేరారు. ఆదివారం వేకువజామున బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపానికి రాగానే కుక్క రోడ్డు దాటుతూ అకస్మాత్తుగా కారుకు అడ్డం వచ్చింది. దీన్ని తప్పించే క్రమంలో కారు జాతీయ రహదారి అంచులో ఉన్న సిమెంట్‌ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వృద్ధ దంపతులు దామర్ల లక్ష్మయ్య (75), వెంకటసుబ్బమ్మ (65)తోపాటు డ్రైవింగ్‌ చేస్తున్న వారి మనుమడు హేమంత్‌ (25) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెనుక సీటులో కూర్చొన్న లక్ష్మయ్య కుమారుడు గణేష్‌ బాబు, కోడలు పద్మజ తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కుపోయారు. విషయం తెలియడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని అతికష్టమ్మీద బయటికి తీసి మార్టూరులోని ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు.


సోదరుడి వివాహం కోసం వచ్చి..

అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని కొత్తపేటకు చెందిన ముక్కు సుధీర్‌రెడ్డి (35), సోదరుడు సుమంత్‌రెడ్డితో కలిసి ఆస్ర్టేలియాలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం సోదరుడి వివాహనం నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. సుధీర్‌రెడ్డి రోజూ ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్తుంటారు. ఆదివారం వాకింగ్‌ ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో కుక్క అడ్డొచ్చింది. దాన్ని తప్పించబోయి కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. 108లో ఆయన్ను కనిగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మరో రెండు రోజుల్లో తిరిగి ఆస్ర్టేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న సుధీర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Untitled-2 copy.jpg

Updated Date - Sep 22 , 2025 | 03:57 AM