నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:26 PM
కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌ల విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు
గాంధీచౌక్‌లో ప్రభుత్వ ఉత్తర్వు కాపీలు దహనం
నంద్యాల రూరల్, నవంబరు22(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌ల విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం గాంధీచౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీలను దహనం చేశారు. నాగరాజు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ విధానాన్ని రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల అనంతరం మల్లి నాలుగు లేబర్ కోడ్ విధానాన్ని కేంద్రం తెరమీదికి తెచ్చిందన్నారు. చట్టాలను అమలు చేయాలని రాష్ర్టాలకు నోటిపై పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వెంకటలింగం, జైలాన తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు పాతబస్టాండ్‌లో..
ఆత్మకూరు: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ ప్రయోజనం కోసం నూతన కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్‌నాయక్ అన్నారు. శనివారం స్థానిక పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కార్మిక చట్టాల ఉత్తర్వులను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకే నూతన కార్మిక చట్టాలు చేసిందన్నారు. కార్మిక సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరించడం తగదని అన్నారు. నూతన చట్టాల రద్దుకు కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రణధీర్, సుబ్బయ్య, రఫీ, సలాం, వీరన్న తదితరులున్నారు.
నందికొట్కూరు కేజీ రోడ్డులో..
నందికొట్కూరు: కార్మికుల హక్కులను హరించడం తగదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురామ్మూర్తి అన్నారు. పట్టణంలోని కేజీ రోడ్డుపై ఏఐటీయూసీ పట్టణ సమితి ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ ఈనెల 26న నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు హుస్సేన, నాగేంద్ర, బాలస్వామి, కురువ రమేష్ పాల్గొన్నారు.
… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను అమలు చేయడాన్ని నిరసిస్తూ జీవో ప్రతులను మున్సిపల్ వర్కర్స్ యూనియన నాయకుడు నాగేశ్వరరావు అధ్యక్షతన దహనం చేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసే విధంగా కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు ఉస్మానబాషా, మున్సిపల్ వర్కర్స్ యూనియన నాయకులు బాసిద్, నాగన్న పాల్గొన్నారు.