డోలీలో నాలుగు కిలోమీటర్లు
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:43 PM
మండలంలోని శివారు జర్రెల పంచాయతీ గునుకురాయి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని డోలీలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని తరలించిన కుటుంబ సభ్యులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
గునుకురాయి గ్రామానికి రహదారి సౌకర్యం లేక అవస్థలు
గూడెంకొత్తవీధి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివారు జర్రెల పంచాయతీ గునుకురాయి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని డోలీలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలికి ఒక్కసారిగా రక్తపోటు పెరిగిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గునుకురాయి గ్రామానికి చెందిన గెమ్మెల ముక్తమ్మ(61)కి బుధవారం రాత్రి ఆయాసం, జ్వరం వచ్చింది. గ్రామానికి కనీస రహదారి లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో ఆమెను గ్రామం నుంచి గడిమామిడి వరకు నాలుగు కిలోమీటర్లు మోసుకు వెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్సులో జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. వృద్ధురాలికి రక్తపోటు అధికం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గడిమామిడి వరకు అంబులెన్సులో తరలించగా, అక్కడ నుంచి కుటుంబ సభ్యులు గ్రామానికి డోలీలో మోసుకు వెళ్లారు. గ్రామానికి రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.