Legislative Council: శాసనమండలిలో 4 బిల్లులకు ఆమోదం
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:49 AM
రాష్ట్ర శాసన మండలిలో సోమవారం నాలుగు ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లు (2025)ను రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
కార్మికుల పనిగంటల పెంపు, ‘మహిళలకు నైట్ డ్యూటీల’ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్
అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసన మండలిలో సోమవారం నాలుగు ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లు (2025)ను రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. గిరిజన కమిషన్ నియామకానికి సంబంధించి కాలపరిమితిని తొలగిస్తూ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ సవరణ బిల్లు (2025)ను గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, భిక్షాటనకు సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన పదాలను తొలగిస్తూ ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ అమెండ్‌మెంట్‌బిల్లు (2025)ను సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు తరపున పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కార్మికుల పని గంటల పెంపు, మహిళలు రాత్రివేళల్లో కూడా పనిచేయడానికి (నైట్‌డ్యూటీ) అవకాశం కల్పిస్తూ ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సవరణ బిల్లు (2025)ను కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభ ఆమోదం కోసం ప్రతిపాదించారు. మొదటి మూడు బిల్లులకు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపకపోవడంతో అవి ఏకగ్రీవంగా సభ ఆమోదం పొందాయి. కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సవరణ బిల్లును మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. బిల్లును పునఃసమీక్షించాలని వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సభలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల పని గంటలను పెంచడం వల్ల వారిపై యాజమాన్యాల వేధింపులు ఇంకా ఎక్కువవుతాయన్నారు. దీనికి మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరణ ఇస్తూ.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల్లో 48 పని గంటలు పూర్తి చేస్తే.. శని, ఆదివారాల్లో కార్మికులు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మార్పులను కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకే చేశామని వివరించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభలోనే ప్లకార్డును ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కానీ మండలి చైర్మన్ బిల్లు ఆమోదానికి ఓటింగ్ నిర్వహించారు. దీనికి అధికార పార్టీ సభ్యులు మద్దతు పలకడంతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.