Permanent Judges: నలుగురు హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:29 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సేవలందిస్తున్న నలుగురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా కల్పిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్
త్వరలో ప్రమాణం చేయనున్నజస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి,జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ కూడా
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సేవలందిస్తున్న నలుగురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా కల్పిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నలుగురూ అదనపు న్యాయమూర్తులుగా 2023 అక్టోబరు 21 ప్రమాణం చేశారు. రెండేళ్ల పదవీకాలం వచ్చే అక్టోబరు 20తో ముగియనుంది. ఈ నేపఽథ్యంలో వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసును ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వీరితో త్వరలో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించనున్నారు.