Former TTD Chairman Bhumana: కల్తీ నెయ్యి గురించి విన్నా...
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:00 AM
కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారుల ఎదుట విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హాజరయ్యారు.
తిరుమలలో అది కొత్త విషయం కాదు
ఎన్టీఆర్ కాలం నుంచీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కి
టీటీడీ మాజీ చైర్మన్ భూమన వ్యాఖ్యలు
2సార్లు చైర్మన్‌గా ఉండీ నెయ్యి నాణ్యత గురించి తెలుసుకోలేదా?
సిట్ ప్రశ్నలు.. పలు ప్రశ్నలకు తెలియదంటూ జవాబు
తిరుపతి/ తిరుపతి (నేరవిభాగం), డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారుల ఎదుట విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హాజరయ్యారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి శనివారం ఉదయం 11 గంటలకు ఆయన చేరుకున్నారు. 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల దాకా ఆయన్ను సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఏది అడిగినా, తనకేమీ తెలియదని భూమన సమాధానమిచ్చినట్టు తెలిసింది. రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గానూ, ఒక పర్యాయం ఎక్స్ అఫిషియో మెంబరుగా, కొనుగోలు కమిటీ సభ్యునిగా పనిచేసినందున టీటీడీ వ్యవహారాలపై లోతైన అవగాహన, పాలనా వ్యవహారాలపై పట్టు కలిగిన వ్యక్తిగా కల్తీ నెయ్యి గురించి ఎందుకు పట్టించుకోలేదని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. రెండోసారి చైర్మన్ అయ్యాక, నెయ్యి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోలేదా? పోటు ఎప్పుడైనా సందర్శించారా? కొనుగోలు కమిటీ సభ్యునిగా శ్రీవారి లడ్డూ రుచి ఎలా ఉందో తెలుసుకోలేదా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, నాణ్యత పరీక్షలు చేయడానికి ప్రత్యేకంగా టీమ్ ఉంటుందని, వాటి గురించి తామెందుకు పట్టించుకుంటామని వ్యాఖ్యానించినట్టు సమాచారం. నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించడమనేది ఎప్పటి నుంచో జరుగుతోందని, ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన కాలంలో 12సార్లు, చంద్రబాబు తొలిసారి సీఎం అయిన కాలంలో 14సార్లు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 16 సార్లు, చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక 14 సార్లు, జగన్ ప్రభుత్వంలో 16సార్లు నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపించారని సమాధానమిచ్చినట్టు తెలిసింది. గతేడాది ప్రభుత్వం మారాక తొమ్మిది ట్యాంకర్లు రాగా, అందులో నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపారని, వాటిలో నెయ్యి కల్తీ అయిందని విన్నానని చెప్పినట్టు తెలిసింది.
నెయ్యి సరఫరా టెండరు నిబంధనలను సడలిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని సిట్ అధికారులు ప్రశ్నించగా, పాలకమండలిలో ప్రతిపక్షం ఉండదని, అంతా ఒకేపక్షం కాబట్టి చాలావరకూ బోర్డు నిర్ణయాలపై అభ్యంతరాలు, వ్యతిరేకత వ్యక్తం కావని చెప్పినట్టు తెలిసింది. అజెండాను చదువుతారని, సభ్యులంతా ఆమోదించడం జరుగుతుందని, నెయ్యి కల్తీ గురించి తమకు ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. భూమనను సీబీఐ డీఐజీ మురళీ రాంబా, తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు విచారించారు. కాగా సిట్ అధికారుల విచారణకు హాజరైన భూమన కరుణాకర్‌రెడ్డి వెంట ఆయన న్యాయవాది ఉన్నట్టు తెలిసింది. మరోవైపు భూమనను ప్రశ్నించడంతో కల్తీ నెయ్యి కేసులో గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన ఇద్దరిని సిట్ విచారించినట్టయింది. కాగా కరుణాకరరెడ్డిని విచారించినట్టు సిట్ వర్గాలు ధ్రువీకరించగా, భూమన సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన శనివారం హైదరాబాద్‌లో ఉన్నట్టు ప్రచారం చేశారు. అయితే, ఆయన శనివారం ఉదయమే హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకుని.. సిట్ కార్యాలయానికి వెళ్లినట్టు తెలిసింది.