Share News

First Arrest in TTD Fake Ghee Case: టీటీడీలో తొలి అరెస్టు

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:51 AM

కల్తీ నెయ్యి కేసులో టీటీడీలో తొలి అరెస్టు చోటుచేసుకుంది. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన ఆర్‌ఎ్‌సఎస్వీ సుబ్రమణ్యాన్ని...

First Arrest in TTD Fake Ghee Case: టీటీడీలో తొలి అరెస్టు

  • కల్తీ నెయ్యి కేసులో అప్పటి ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రమణ్యం అదుపులోకి..

  • డిసెంబరు 10 వరకు రిమాండ్‌

తిరుపతి/తిరుపతి(నేరవిభాగం), నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో టీటీడీలో తొలి అరెస్టు చోటుచేసుకుంది. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన ఆర్‌ఎ్‌సఎస్వీ సుబ్రమణ్యాన్ని (58) సిట్‌ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు డిసెంబరు 10వ తేదీ వరకూ ఆయనకు రిమాండు విధించింది. ఈ కేసులో సిట్‌ అధికారులు సుబ్రమణ్యంను ఏ29గా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం టీటీడీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. తిరుపతి ఎన్‌జీవో కాలనీలోని ఆయన నివాసం నుంచి గురువారం మధ్యాహ్నం సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత రుయా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించిన అనంతరం సాయంత్రానికి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసు సిట్‌గా ఏర్పడి సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిపిందే. ఈ కేసులో 28 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో ఇద్దరు టీటీడీ కిందిస్థాయి ఉద్యోగులు కూడా ఉన్నప్పటికీ ఇంతవరకూ అరెస్టు కాలేదు. నిందితులు 28 మందిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మిగిలిన వారిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అయితే, టీటీడీ పరిధిలో అరెస్టులు సుబ్రమణ్యం ఒక్కరితోనే ఆగుతాయా లేక మరికొందరికి కూడా అరదండాలు పడతాయా అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడం, డిసెంబరు 15లోపు తుది చార్జిషీటు దాఖలు చేస్తారన్న సమాచారం నేపఽథథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


వైవీ పీఏ చిన్న అప్పన్నకు సహకారం

కల్తీ నెయ్యి దందాలో అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్నకు ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం హోదాలో సుబ్రమణ్యం సహకరించినట్టు సమాచారం. 2019 నుంచీ 2023 వరకూ టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎంగా ఆయన పనిచేశారు. 2022లోచిన్న అప్పన్న ఆయనను సంప్రదించి, నెయ్యి సరఫరాదారుల వివరాలు కోరినట్టు సిట్‌ గుర్తించింది. నెయ్యి సరఫరా చేసే డెయిరీల పేర్లు, వాటి చిరునామాలు, యజమానుల వివరాలు, వారి మొబైల్‌ నంబర్లు, డెయిరీల అధికారుల వివరాలు, వారి మొబైల్‌ నంబర్లు, ఏయే సంస్థ ఎంతెంత పరిమాణంలో నెయ్యి సరఫరా చేస్తున్నదీ, టెండర్ల గడువు తదితర కీలక సమాచారాన్ని సుబ్రమణ్యమే చిన్న అప్పన్నకు ఇచ్చారని సిట్‌ గుర్తించింది. ముఖ్యంగా భోలేబాబా డెయిరీ ప్రతినిధుల వివరాలు ఇవ్వడంతోపాటు వారికి సుబ్రమణ్యమే ఫోన్‌ చేసి చిన్న అప్పన్న ఫోన్‌ చేస్తారని, ఆయన మాట్లాడాలని సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో సుబ్రమణ్యం కాల్‌ రికార్డు డేటా సహా పలు వివరాలు సిట్‌ సేకరించినట్టు సమాచారం. భోలేబాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాసిరకంగా ఉందని మైసూరు ల్యాబ్‌ నుంచి రిపోర్టు వచ్చిన్పటికీ దాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి ఆయన తీసుకుపోలేదని, విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయలేదని సిట్‌ గుర్తించినట్టు తెలిసింది. జీఎం హోదాలో ఉండి శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందని తెలిసి కూడా అనుమతించారని, ఆ విషయం బయటపెట్టకుండా మౌనం వహించారని సిట్‌ భావిస్తోంది. నెయ్యి సరఫరాకు సంబంధించిన రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించలేదని తెలుస్తోంది. చిన్న అప్పన్నకు, ఆయనకు మధ్య కొంతమేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారని తెలిసింది.

ఇప్పటికీ కీలకమైన విధుల్లోనే..

కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించారని తీవ్ర స్థాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్రమణ్యం టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హోదాలో తిరుమలలో శ్రీవారి ఆలయం సహా మాడవీధుల విధుల్లో ఉన్నారు. ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం పోస్టు నుంచి రిలీవయ్యాక టీటీడీ చీఫ్‌ ఇంజనీర్‌కు పీఎ్‌సగా నియమితుడైన సుబ్రమణ్యం తర్వాత గత ప్రభుత్వంలోనే సాక్షాత్తూ తిరుమలలో శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాలకు ఈఈ-1గా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై, టీటీడీలో ఉన్నతాధికారులంతా మారి, కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారు.


రవికుమార్‌ ఖాతాలపై సీఐడీ ఆరా

పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్‌ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు బృందం దృష్టిపెట్టింది. ఆయనతో పాటు కటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తిరుపతి, చిత్తూరు, బెంగుళూరుల్లో ఉన్న బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. పెద్దఎత్తున లావాదేవీలు ఏమైనా జరిగాయా? ఎవరి ఖాతాలనుంచి ఎవరి ఖాతాల్లోకి బదలాయింపులు జరిగాయి? అన్న కోణంలో సీఐడీ ఎస్‌ఐల నేతృత్వంలో వివరాలు సేకరిస్తున్నారు.

ముడుపులూ ముట్టాయి

చిన్న అప్పన్నను సిట్‌ అధికారులు గత నెల 29వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ఈనెల 17వ తేదీన కొట్టివేసింది. అయితే ఆ పిటిషన్‌పై వాదనలు జరిగినప్పుడు సిట్‌ తరపున వాదించిన ఏపీపీ జయశేఖర్‌.... ఏ24 కడూరు చిన్న అప్పన్న కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని, 2022 ఏప్రిల్‌లో సుబ్రమణ్యం నుంచి నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం సేకరించారని వాదనలు వినిపించారు. చిన్న అప్పన్న నుంచి సుబ్రమణ్యానికి నాలుగైదు లక్షల నగదు అందిందని సిట్‌ గుర్తించినట్టు వాదనలు వినిపించారు. ఆ సందర్భంలోనే ఈ కేసులో సుబ్రమణ్యం పాత్ర బహిర్గతమైంది. తాజాగా గురువారం కల్తీ నెయ్యి కేసులో ఆయన ఏ29గా మారారు.

Updated Date - Nov 28 , 2025 | 05:51 AM