Share News

Businessman Complaint: చంపుతామంటున్నారు... రక్షణ కల్పించండి

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:44 AM

మా వద్ద అప్పుగా తీసుకున్న రూ.25 లక్షలు చెల్లించమంటే చంపేస్తామంటూ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, ఆయన అనుచరుడు ఆశిక్‌ సన్నీ బెదిరిస్తున్నారు. నన్ను, మా తమ్ముడిని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు.

Businessman Complaint: చంపుతామంటున్నారు... రక్షణ కల్పించండి

  • ఇసుక రీచ్‌ కోసం డబ్బు తీసుకున్నారు.. అడుగుతుంటే బెదిరిస్తున్నారు

  • మాజీ ఎంపీ నందిగం, అనుచరుడు సన్నీపై ఫిర్యాదు

  • ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితుడు

గుంటూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘మా వద్ద అప్పుగా తీసుకున్న రూ.25 లక్షలు చెల్లించమంటే చంపేస్తామంటూ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, ఆయన అనుచరుడు ఆశిక్‌ సన్నీ బెదిరిస్తున్నారు. నన్ను, మా తమ్ముడిని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించండి’ అంటూ ఓ మైనారిటీ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. గుంటూరు ముఫ్తీ వీధికి చెందిన షేక్‌ ముజీబుర్‌ రెహమాన్‌, అతని సోదరుడు షేక్‌ నౌషాద్‌ ఆటోనగర్‌లో ఆటోమొబైల్‌ విడి పరికరాల వ్యాపారం చేస్తుంటారు. వారి స్నేహితుడు, కానిస్టేబుల్‌ అఫ్జల్‌ అలీ ఖాన్‌ గతంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌కు గన్‌మన్‌గా పనిచేశాడు. ఆయన ద్వారా సన్నీ పరిచయమయ్యాడు. తాను ఇసుక వ్యాపారం చేస్తుంటానని, సురేశ్‌ తనకు ఇసుక రీచ్‌ ఇచ్చాడని రెహమాన్‌ సోదరులతో చెప్పిన సన్నీ... వ్యాపార నిమిత్తం రూ.25 లక్షలు అవసరమైందని, ఆ మొత్తం సర్దుబాటు చేస్తే మూడు నెలల్లో తిరిగిచ్చేస్తానని నమ్మబలికాడు. రెహమాన్‌ తన భార్య బంగారు నగలను బ్రాడీపేటలోని రెప్కో బ్యాంకులో తాకట్టు పెట్టి మూడు దఫాలుగా రూ.25 లక్షలు సన్నీకి ఇచ్చాడు. 3 నెలలు గడిచినా తిరిగివ్వకపోవడంతో రెహమాన్‌ పలుసార్లు ఫోన్‌ చేసి అడిగాడు. ‘చిల్లిగవ్వ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. నన్నేమీ పీకలేవు. నాకు అధికార పార్టీ ఎంపీతో పాటు రౌడీషీటర్లు, బ్లేడ్‌ బ్యాచ్‌లతో సంబంధాలున్నాయని సన్నీ బెదిరించాడు. అతడి అనుచరులు నరికేస్తామన్నారు. నందిగం సురేశ్‌ అండదండలు ఉన్నాయని, మీరేమీ పీకలేరంటూ బెదిరించారు. దీంతో నా సోదరుడు నౌషాద్‌ తీవ్ర మనస్తాపంతో 2023 డిసెంబరు 14న ఆత్మహత్యాయత్నం చేశాడు. 10 రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. దానిపై అప్పుడు, తాజాగా కూడా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగ లేదు’ అని రెహమాన్‌ వాపోయారు. గతంలో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే లాలాపేటకు పంపారని.. అక్కడకు సన్నీ, ఎంపీ సురేశ్‌ కాన్వాయ్‌తో వచ్చి పోలీసులను సైతం బెదిరించాడని చెప్పారు. ఇప్పుడు కూడా డబ్బులు అడుగుతుంటే రూ.10 వేలు బిహారీలకు ఇస్తే మిమ్మల్ని చంపేస్తారంటూ సన్నీ, అతడి అనుచరులు బెదిరింపులకు దిగారని.. ఈ నేపథ్యంలో తన తమ్ముడు మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడని వివరించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, ఆశిక్‌ సన్నీ, అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రెహమాన్‌ కోరారు.

Updated Date - Jul 08 , 2025 | 04:47 AM