Share News

Former MP M.V.V. Satyanarayana: నీ అంతు చూస్తా

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:48 AM

డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) కార్యాలయంలో వైసీపీకి చెందిన విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వీరంగం సృష్టించిన ఉదంతం ఆలస్యం వెలుగులోకి వచ్చింది.

Former MP M.V.V. Satyanarayana: నీ అంతు చూస్తా

  • డీటీసీపీ విద్యుల్లతపై విశాఖ మాజీ ఎంపీఎంవీవీ సత్యనారాయణ వీరంగం

  • విశాఖలో తన అపార్ట్‌మెంట్‌కు అనుమతులివ్వనందుకు బెదిరింపులు

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) కార్యాలయంలో వైసీపీకి చెందిన విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వీరంగం సృష్టించిన ఉదంతం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. గత గురువారం (జూలై 24న) మంగళగిరిలోని డీటీసీపీ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎంపీ, ఆయన అనుచరుడు కుమార్‌ డీటీసీపీ విద్యుల్లతను మహిళ అనే విచక్షణ కూడా లేకుండా దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. విశాఖలో ఆయన నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన స్థలం చర్చికి చెందినది కావడం, కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నందున డీటీసీపీ అనుమతులు నిరాకరించారు. దీంతో ఎంవీవీ మంగళగిరి వచ్చి రెచ్చిపోయారు. ‘నీ అంతు చూస్తా.. పర్సనల్‌ కేసులు పెట్టి కోర్టుకు లాగుతా.. నీకు రూ.50 లక్షలు లంచం ఇచ్చామని చెబుతా’ అని ఎస్సీ మహిళా అధికారి అయిన విద్యుల్లతపై విరుచుకుపడ్డారు. ఆయన వెంట ఉన్న కుమార్‌ అనే వ్యక్తి.. మహిళా అధికారి అని కూడా చూడకుండా పరుష పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో డీటీసీపీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె అప్పుడే మంత్రి పి.నారాయణ, ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. సింగపూర్‌ పర్యటనకు వెళ్లే హడావుడిలో.. తర్వాత చూద్దామని వారు చెప్పడంతో ఈ అంశం అప్పుడు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు బయటపడింది. విశాఖ సిరిపురం జంక్షన్‌లో ఎంవీవీ ‘పీక్స్‌’ అనే అపార్ట్‌మెంట్‌ నిర్మాణం ప్రారంభించారు. ఆ నిర్మాణ స్థలానికి సంబంధించి గతంలోనే కోర్టు వివాదముంది. కోర్టులో వివాదం నడుస్తున్నందున పర్మిషన్‌ ఇవ్వడం కుదరదని డీటీసీపీ తిరస్కరించారు. ఆ భవనానికి సంబంధించి మాజీ ఎంపీ గానీ, ఆయనతో వచ్చిన కుమార్‌ గానీ దరఖాస్తుదారులు కాదని.. అయినా నానా రకాలుగా దుర్భాషలాడడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని విద్యుల్లత ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 04:48 AM