Former MP Kusuma Krishnamurthy: పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:18 AM
మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. ఇక, కుసుమ కృష్ణమూర్తి మరణంపై పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా, కృష్ణమూర్తి 1940 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గోదావరి జిల్లాలో జన్మించారు. అయినవిల్లి మండలం, విలస గ్రామం ఆయన జన్మస్థలం. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్‌లో వివిధ పదవుల్లో సేవలు అందించారు. అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి మూడు సార్లు గెలిచారు.
1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో పని చేశారు. 1980 నుంచి 82 వరకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమ సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. ఆయన ‘దళిత వేదం’ అనే పేరుతో బుక్ కూడా రాశారు. కుసుమ కృష్ణమూర్తి చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.