Share News

Political Criticism: మారని ప్రసన్న తీరు

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:12 AM

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మహిళా సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాయి.

 Political Criticism: మారని ప్రసన్న తీరు

  • ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అవే అనుచిత వ్యాఖ్యలు.. వాటికే కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ

  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు రేగుతున్నా నిస్సిగ్గుగా సమర్థించుకున్న వైసీపీ నేత

నెల్లూరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మహిళా సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాయి. వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రసన్న తీరుపై మండిపడ్డాయి. అయినప్పటికీ.. ఆయన మాటతీరు మాత్రం మారలేదు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రశాంతిరెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు వందశాతం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ మంటలు రేపిన ప్రసన్న వ్యాఖ్యలు యథాతథంగా..

సోమవారం.. పిచ్చి ప్రేలాపనలు

కోవూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ...

‘‘ప్రశాంతిరెడ్డి చెబుతోంది.. నేను అవినీతిలో పీహెచ్‌డీ చేశానంట. మరి నీ సంగతేంది తల్లీ. రేణిగుంట దగ్గర మెస్‌లో పీహెచ్‌డీ చేశావు. బెంగళూరులో, హైదరాబాద్‌, మద్రాసులో పీహెచ్‌డీ చేశావు. చివరికి మాగుంట లేఅవుట్లో కూడా పీహెచ్‌డీ చేశావు. అది ఏ పీహెచ్‌డీ అనేది అందరికీ తెలుసు. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని బ్లాక్‌మెయిల్‌ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనో పిచ్చోడు. ఈమెను ఎందుకు చేసుకున్నాడో ఎవరికీ అర్థం కాలే. ఆయన అడిగితే ఏదో మంచి కుటుంబంలో ముక్కుపచ్చలారని అమ్మాయిని ఇచ్చి ఆయనకు పెళ్లి చేసుండేవాళ్లం. ఈ బోరు బావిలో పడిపోయారు. ప్రభాకరరెడ్డిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా. నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల అడిగినా చెబుతారు. ఆ ప్రభాకరరెడ్డికి కూడా మనసు బాగున్నట్లు లేదు. ఆయనను నానా హింసలు పెడుతున్నట్లు ఉంది. ఆయనకీ అర్థమైనట్లు ఉంది.. ఎందుకొచ్చిన ఖర్మరా అనుకొంటున్నట్లు ఉన్నారు. నేనైతే ప్రభాకరెడ్డికి ఒకటి చెప్పాలనుకున్నా. ప్రభాకరన్నా.. నువ్వు నిద్రలో ఉన్నా చనిపోతావ్‌... బయట ఎక్కడో ఒకదగ్గర నిన్ను లేపేస్తారు. జాగ్రత్తగా ఉండు.. నీ దగ్గర వేల కోట్ల ఆస్తులున్నాయి. వాటికోసం నిన్ను లేపేస్తారు. ఇప్పటికే రెండు సిట్టింగ్‌లు అయినట్లు సమాచారం ఉంది. నడమంత్రపు సిరి రాజమాత కదా..!’’ అని ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు.


మంగళవారం నిస్సిగ్గుగా సమర్థన

మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శలు వస్తున్నా.. ఆయన మాత్రం వాటిని నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. తన మాటలకు వందశాతం కట్టుబడే ఉన్నానని, వాటిని వెనక్కు తీసుకోనని తెగేసి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

‘‘కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతోంది. ఎన్నికలప్పుడు తప్ప.. ఈ ఏడాది కాలంలో నేను ఎంపీ ప్రభాకరరెడ్డిని కానీ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఇటీవల ఆమె ముదివర్తిపాలెం వెళ్లింది. ఆ కాజ్‌ వే ఏదో ఆమే చేయించినట్లు, ప్రసన్నకుమార్‌రెడ్డి ఒక తట్ట మన్ను కూడా వేయలేదని, అన్ని తానే చేశానని ప్రగల్భాలు పలికింది. అవినీతిపరుడినని ఏదేదో మాట్లాడింది. ఆమె మాట్లాడినదానికి సోమవారం నేను కౌంటర్‌ ఇచ్చాను. ఈ మాటలకు కట్టుబడి ఉన్నాను. వాటిని వెనక్కు తీసుకోను. నేను చెప్పింది నూటికి నూరు శాతం నిజం. నా మీదకు వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేనూ వ్యక్తిగతంగా వచ్చాను. దమ్ము, ధైర్యం ఉంటే ప్రభాకరరెడ్డి, నువ్వు ప్రెస్‌మీట్‌ పెట్టండి. మళ్లీ దానికి కౌంటర్‌ ఇచ్చుకుంటాం. ఏదో ఈవీఎంల దయతో ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోయినంత మాత్రాన పెద్ద పుడింగులు అయిపోయారా.. మీరంతా..? ఇళ్ల మీదకు వచ్చిధ్వంసం చేశారు. నేను ఉండి ఉంటే నన్ను చంపేసేవారు. దేవుడు నన్ను బయటకు పంపించాడు. 1961 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎంతో మంది నాయకులను చూశాం. ఎవరూ కూడా ఇలాంటి సంప్రదాయాలకు శ్రీకారం చుట్టలేదు. చాలా తప్పు చేశారు. మంచిది కాదిది...’ అంటూ ప్రసన్న వాఖ్యానించారు.


ప్రసన్నకుమార్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: శైలజ

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోందని కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రసన్నకుమార్‌రెడ్డి మాటలు మహిళా లోకాన్ని కించపరిచేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. మహిళలను అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం హేయం. మహిళలను చులకనగా చూడడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం వంటివి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే కుట్రగా పరిగణించాలి. ప్రసన్నకుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Updated Date - Jul 09 , 2025 | 08:12 AM