Police Restrictions: మీరు అడుగు పెడితే అలజడే
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:49 AM
మీరు వస్తే అలజడి రేగుతుంది. శాంతి భద్రతల సమస్య వస్తుంది. కాబట్టి మీరు రావడానికి వీల్లేదు.’’ అని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు తేల్చి చెప్పారు.
తాడిపత్రికి రావడానికి వీల్లేదు
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తేల్చి చెప్పిన అనంత పోలీసులు
పుట్లూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘‘మీరు వస్తే అలజడి రేగుతుంది. శాంతి భద్రతల సమస్య వస్తుంది. కాబట్టి మీరు రావడానికి వీల్లేదు.’’ అని అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు తేల్చి చెప్పారు. ఆయనను తాడిపత్రిలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. సోమవారం ఉదయం తన స్వగ్రామం యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామ శివారులో పోలీసులు పెద్దారెడ్డి సహా ఆయన వెంట వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పెద్దారెడ్డితో తాడిపత్రి రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సత్యబాబు మాట్లాడారు. శివుని విగ్రహావిష్కరణకు తాడిపత్రికి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు వచ్చాయని, అక్కడ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, వెనుదిరగాలని పెద్దారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి పెద్దారెడ్డి ససేమిరా అన్నారు. తనకు కోర్టు అనుమతి ఉందంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డగింతతో సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. అక్కడకి వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అనుమతించకపోవడంతో పెద్దారెడ్డి తిరిగి తిమ్మంపల్లికి వెళ్లిపోయారు.