Share News

Excise Officials: జోగి రమేశ్‌ అరెస్టు

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:08 AM

ఊహించినట్లుగానే నకిలీ మద్యం తయారీ కేసు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ మెడకు చుట్టుకుంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు జోగి రామును ఎక్సైజ్‌, సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Excise Officials: జోగి రమేశ్‌ అరెస్టు

  • నకిలీ మద్యం కేసులో అదుపులోకి

  • ఆయనతోపాటు తమ్ముడు కూడా..

  • ఉదయం ఇంటి వద్ద, రాత్రి ఆస్పత్రిలో, ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హైడ్రామా.. పోలీసులపై దౌర్జన్యం.. కోర్టులోనూ బైఠాయింపు

  • సిట్‌ అధికారులు ఇంటికొచ్చాక 3 గంటలు

  • బెడ్‌రూమ్‌ నుంచి బయటికే రాని రమేశ్‌

  • శ్రేణులను రప్పించి ఆందోళన చేయించే యత్నం

  • వారు వచ్చాక తలుపులు తీసుకుని బయటికి

  • ఆ వెంటనే అరెస్టు నోటీసులిచ్చిన అధికారులు

  • రమేశ్‌తోపాటు ఆయన సోదరుడు రాము, పీఏనూ అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • రాత్రి 8 వరకు జోగి ఇంట్లో తనిఖీలు

  • కీలక పత్రాలు, 2 ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు,ఒక హార్డ్‌డిస్క్‌, ఆయన కారు స్వాధీనం

  • ఆర్థిక లావాదేవీలపై జోగికి 7 గంటలు సిట్‌ ప్రశ్నలు

  • రాత్రి 10కి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు

  • వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు

విజయవాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఊహించినట్లుగానే నకిలీ మద్యం తయారీ కేసు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ మెడకు చుట్టుకుంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు జోగి రామును ఎక్సైజ్‌, సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి ఇంటికి ఎక్సైజ్‌, సిట్‌ అధికారుల బృందం ఆదివారం తెల్లవారుఝామున 5.30 గంటలకు వెళ్లింది. ముందుగా ఇంటిని తనిఖీ చేస్తున్నామని సెర్చ్‌ నోటీసు ఇచ్చారు. పోలీసుల రాకను గమనించిన మాజీ మంత్రి మూడు గంటలపాటు పడక గది తలుపులు తీయకుండా లోపలే ఉండిపోయారు. వైసీపీ కార్యకర్తలను, స్థానిక నేతలను ఇంటికి రప్పించుకున్నారు. వారు ఆందోళన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన తలుపులు తీసుకుని బయటకు వచ్చారు. ఆయన బయటకు రాగానే ఎక్సైజ్‌ ఏఈఎస్‌ రామ్‌శివ అరెస్టు నోటీసు అందజేశారు. తర్వాత జోగి సోదరులతోపాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.


అనంతరం వారిని విజయవాడ గురునానక్‌ కాలనీలోని ఎక్సైజ్‌ తూర్పు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ సిట్‌ ఎస్పీ కడియం చక్రవర్తి సాయంత్రం 4 గంటల వరకు ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టారు. కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు చెప్పిన అంశాలు, దర్యాప్తు సందర్భంగా తాము సేకరించిన ఆధారాలను వారి ముందుం చి ప్రశ్నించారు. అయితే ఈ కేసుతో తనకెలాంటి సంబంధమూ లేదని, రాజకీయ కుట్రతోనే కేసులు పెట్టారని జోగి రమేశ్‌ వాగ్వాదానికి దిగారు. వారితో పాటు తీసుకెళ్లిన పీఏ రామును అధికారులు ప్రశ్నించి ఉదయం 11 గంటల సమయంలో స్టేషన్‌ నుంచి పంపేశారు.

కేసులో ప్రధాన పాత్రధారి..

నకిలీ మద్యం తయారీ, సరఫరా వెనుక జోగి రమేశే ఉన్నారని.. ఆయన సంపూర్ణ సహకారంతోనే తయారుచేసి మద్యం దుకాణాలకు పంపామని ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు, అతడి సోదరుడు జగన్మోహన్‌రావు గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తనకు ఎటువంటి సంబంధమూ లేదని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ తనను ఇరికిస్తున్నారని జోగి ఎదురుదాడికి ప్రయత్నించారు. అద్దేపల్లి సోదరులను సిట్‌ అధికారులు వారం పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. జోగిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు.. ఏయే అంశాలపై చర్చించారు.. నకిలీ మద్యం తయారీకి ముడి సరుకు సరఫరా, ఆ తర్వాత మద్యం షాపులకు పంపించడం, వాటి ద్వారా వచ్చిన నగదుతో జరిగిన లావాదేవీల వంటి కీలక వివరాలను జనార్దనరావు నుంచి రాబట్టారు. అతడి వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసిన సిట్‌.. కొద్దిరోజుల కింద కోర్టుకు కూడా సమర్పించింది. తదనంతరమే జోగి సోదరులను అరెస్టు చేసింది. ఎక్సైజ్‌ స్టేషన్‌లో విచారణ పూర్తయ్యాక వారిని రాత్రి 9.45 గంటలకు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొద్దుపోయాక అర్ధరాత్రి సమయంలో ఆరో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. కేసులో రమేశ్‌ను (ఏ-18), జోగి రాము (ఏ-19)గా చేర్చారు.


ఎప్పుడేం జరిగిందంటే..

  • అక్టోబరు 3న అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రం

  • 6న ఇబ్రహీంపట్నంలో మరో తయారీ కేంద్రం గుర్తింపు. అదేరోజు జనార్దనరావు నిర్వహిస్తున్న ఏఎన్‌ఆర్‌ బార్‌ సీజ్‌

  • అద్దేపల్లి జగన్మోహనరావుతో పాటు బా దల్‌దాస్‌, ప్రదీ్‌పదా్‌సల అరెస్టు

  • ఆఫ్రికాలో ఉన్న జనార్దనరావు 10న విజయవాడ రాగానే అరెస్టు. ప్రసుతం నెల్లూరు జైలుకు ప్రధాన నిందితుడు

  • 13న జోగి రమేశ్‌ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు వీడియో విడుదల చేసిన జనార్దనరావు

  • 15న నకిలీ మద్యాన్ని విక్రయించిన వి ద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్‌ సీజ్‌

  • 24 నుంచి 30 వరకు అద్దేపల్లి సోదరులను కస్టడీలో విచారించిన సిట్‌.

  • నవంబరు 2న జోగి సోదరుల అరెస్టు.


ఎస్సైపై జోగి కుమారుడి దౌర్జన్యం!

ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ నేతల హంగామా

జోగి సోదరులను ఆదివారం రాత్రి 10 గంటల కు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో జోగి కుమారుడు రాజీవ్‌ వైసీపీ నేతలతో కలిసి హంగామాచేశారు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌, జోగి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. అత్యవసర సేవల విభాగంలోకి జోగి సోదరులను తీసుకెళ్తుండగా.. అప్పటికే అక్కడున్న రాజీవ్‌, వైసీపీ నేతలు లోపలకు తోసుకొచ్చారు. క్యాజువాలిటీ వా ర్డు అద్దం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తన ను అడ్డుకోబోయిన మాచవరం ఎస్సైపై రాజీవ్‌ దౌర్జన్యానికి దిగారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా బయటకు నెట్టేశారు. విధినిర్వహణలో ఉన్న ఎస్సైపై దాడి చేసినందుకు, ప్రభుత్వాస్పత్రిలో అద్దం ధ్వంసం చేసినందుకు రాజీవ్‌ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక జోగి సోదరులను కోర్టుకు తీసుకొస్తున్నారని తెలిసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, నేతలు అక్కడకు తరలివచ్చారు. వారితో కోర్టు హాలు నిండిపోయింది. మేజిస్ట్రేట్‌ లెనిన్‌బాబు రాత్రి 11.30కి కోర్టుకు వచ్చారు. కోర్టు హాలు కిక్కిరిస ఉండడం చూశారు. సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్‌ మహ్మదాలీని తన చాంబరుకు పిలిపించుకున్నారు. న్యాయవాదులు కానివారు బయటకు వెళ్తేనే కోర్టు హాలులోకి వస్తానని స్పష్టంచేశారు. దీంతో ఆయన తన సిబ్బందితో లోపలకు వెళ్లి వైసీపీ నేతలందరినీ బయటకు వెళ్లాలని సూచించారు.

మళ్లీ పిలుస్తామన్నారు: పీఏ రాము

ఎక్సైజ్‌ స్టేషన్‌లో విచారణ సందర్భంగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌ పాత్ర ఏమిటి.. ఎన్నిసార్లు జనార్దనరావును కలిశావని తనను సిట్‌ అడిగిందని ఆయన పీఏ ఆరేపల్లి రాము తెలిపా రు. ‘నాకేమీ తెలియదని, మద్యంతో సంబంధం లేదని చెప్పాను. జోగి రమేశ్‌కు, జనార్దనరావుకు పరిచయం ఉంది. నకిలీ మద్యం కేసులో మాకు సంబంధం లేదు. విచారణకు అందుబాటులో ఉండాలని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పి పంపారు’ అని వెల్లడించారు.

Updated Date - Nov 03 , 2025 | 05:11 AM