Fake Liquor Scam: జోగి-జనార్దన్ లిక్కర్ బంధం
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:26 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు 540 పేజీలతో ప్రాథమిక చార్జ్‌షీట్ సమర్పించారు.
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో 540 పేజీలతో ప్రాఽథమిక చార్జ్‌షీట్
తంబళ్లపల్లె కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు
జోగి రమేశ్, జనార్దన్‌రావుల సంబంధాల ప్రస్తావన
జోగి, అద్దేపల్లి సోదరుల కస్టడీకి రెడీ!
రాయచోటి/ములకలచెరువు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు 540 పేజీలతో ప్రాథమిక చార్జ్‌షీట్ సమర్పించారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. విచారణ నివేదికలు, ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, ఇంకా అరెస్టు కాని నిందితుల వివరాలు.. వంటి అంశాలను పొందుపర్చినట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు, వారి మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలు, కాల్ డేటా, యూపీఐ లావాదేవీలు తదితర వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. ఈ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడి పాత్రపైనా కీలక వివరాలు పొందుపర్చినట్లు తెలుస్తోంది. కేసులో ఉన్న 33 మంది నిందితుల ప్రమేయం, వాటి వివరాలు, ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీకి నగదు ఎవరు సమకూర్చారు, మూలాలు, నగదు లావాదేవాలకు సంబంధించి కూడా వివరాలు ఉన్నట్లు సమాచారం. ఎక్సైజ్ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ పోలీసులు తయారు చేసిన ఈ ప్రాఽథమిక చార్జ్‌షీట్‌ను విజయవాడలోని సిట్ అధికారులు పరిశీలించి.. మార్పులు, చేర్పుల అనంతరం తంబళ్లపల్లె కోర్టులో దాఖలు చేశారు. ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీపై గత అక్టోబరు 3న ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున నకిలీ మద్యం బాటిళ్లు, తయారీకి వినియోగించిన స్పిరిట్ క్యాన్లు, నకిలీ మద్యం, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం మేనేజర్ కట్టా రాజుకు చెందిన డైరీ, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని.. అక్కడే ఉన్న 10 మందిని అరెస్టు చేశారు.
తరువాత విచారణలో మొత్తం 33 మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం అంతటికీ కీలక సూత్రధారిగా వ్యవహరించిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్‌రావుతో పాటు ఇందులో ప్రమేయమున్న మాజీ మంత్రి జోగి రమేశ్, అతని సోదరుడు జోగి రామును కలిపి 29 మందిని అరెస్టు చేశారు. ఇంకా నలుగురు నిందితులు అరెస్టు కావాల్సి ఉంది. తంబళ్లపల్లె నియోజకవర్గ అప్పటి టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి (తర్వాత సస్పెండ్ అయ్యారు), ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌తో పాటు మరో వ్యక్తి ఇంకా అరెస్టు కాలేదు. చట్ట ప్రకారం 60 రోజుల్లో కేసుకు సంబంధించి చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు తొలుత ప్రాథమిక చార్జిషీట్‌ను దాఖలు చేశారు. కేసుకు సంబంధించి విచారణ పూర్తయి నిందితులందరిని అరెస్టు చేసిన తరువాత పూర్తిస్థాయి చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నారు.
త్వరలో నలుగురి కస్టడీకి పిటిషన్లు!
ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు, అతని తమ్ముడు జగన్‌మోహన్‌రావు, మాజీ మంత్రి జోగి రమేశ్, అతని సోదరుడు జోగి రాములను కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. నలుగురినీ కస్టడీకి ఇవ్వాలని తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి పత్రాలు ఇప్పటికే సిద్ధం అయినట్లు సమాచారం.