Former Minister Appalaraju: పోలీసు స్టేషన్‌పై అనుచిత వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:55 AM
మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు శనివారం విచారించారు.
స్టేషన్‌లో మాజీ మంత్రి అప్పలరాజు విచారణ
పత్రాలపై సంతకాలు తీసుకుని వదిలేసిన కాశీబుగ్గ పోలీసులు.. అనుచరుల హల్చల్
పలాస, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు శనివారం విచారించారు. పోలీసు స్టేషన్‌కు పసుపు రంగులు వేస్తామని, ‘ప్రైవేటు పోలీసు స్టేషన్’ అనే పేరు పెడతామని వ్యాఖ్యానించిన నేపథ్యంలో గత ఏడాది కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో విచారణకు రావాలని పేర్కొంటూ శనివారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు అప్పలరాజు తన లాయర్ సహా అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. 3గంటల నుంచి ఆయన్ను విచారణ అధికారి ఎస్‌ఐ నరసింహమూర్తి, ఏఎస్పీ శ్రీనివాసరావులు రాత్రి 9.45 గంటల వరకు పలు కోణాల్లో సుదీర్ఘంగా విచారించారు. అనంతరం కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకుని పంపించేశారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హల్చల్ చేశారు. దీంతో కాశీబుగ్గ పోలీస్టేషన్ సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, ఏఆర్ సిబ్బంది స్టేషన్‌కు చేరుకుని ఎలాంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకుండా పర్యవేక్షించారు.
వివాదాల అప్పలరాజు!
కూటమి ప్రభుత్వంపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అప్పలరాజు.. గతేడాది అక్టోబరు 27న పలాసలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘బాలికపై దాడి చేసిన వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీస్ స్టేషన్‌లో మా పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అలా కేసులు పెట్టకపోతే ఒక పోలీస్టేషన్ ఇక్కడ ఉందన్న విషయం కూడా మేం భావించం. పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేసి తాళాలు వేస్తాం. ‘ప్రైవేటు పోలీస్టేషన్’ అని పేరుపెట్టి దానిని ఎస్పీతో ప్రారంభించేలా చేస్తాం.’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన బి. విజయకృష్ణరాజు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను రెచ్చగొడుతూ, ప్రభుత్వాన్ని కించపరుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రైవేటు పోలీస్ స్టేషన్ పెడతామంటూ తప్పుడు భావజాలాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల మధ్య, రెండు పార్టీలు, కులాలు, గ్రూపుల మధ్య విద్వేషాలు కలిగిస్తున్నారని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం అప్పలరాజుకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరారు.