Share News

Former Maoist Stronghold Puvarti: ఆ ఊళ్లో 50 ఇళ్లు.. 90 మంది మావోయిస్టులు!

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:10 AM

ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా స్వగ్రామం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తి. ఈ గ్రామంలో మొత్తం ఇళ్లు 50 మాత్రమే. అయితే....

Former Maoist Stronghold Puvarti: ఆ ఊళ్లో 50 ఇళ్లు.. 90 మంది మావోయిస్టులు!

  • హిడ్మా స్వగ్రామం పువర్తిలో రాజ్యమేలుతున్న నిశ్శబ్దం

  • ప్రత్యేక బేస్‌ క్యాంప్‌లో వందమంది జవాన్ల పహరా

  • గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఒక్క ఓటూ పడలేదు

  • పువర్తికి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి.. అడవిలో 3 గంటల ప్రయాణం

(చింతూరు/చర్ల-ఆంధ్రజ్యోతి)

ఎన్‌కౌంటర్‌లో హతమైన మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా స్వగ్రామం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తి. ఈ గ్రామంలో మొత్తం ఇళ్లు 50 మాత్రమే. అయితే ఆ ఊరి నుంచి 90 మంది యువకులను మావోయిస్టులుగా హిడ్మా తయారుచేశాడు. దశాబ్దాల తర్వాత పువర్తిలో అడుగుపెట్టిన పోలీసులు దాదాపు ఏడాది కిందట అక్కడ సీఆర్‌పీఎఫ్‌ బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. అక్కడ వందమంది వరకు జవాన్లు నిరంతరం పహరా కాస్తుంటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పువర్తిలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటుచేయడం అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. పువర్తి పోలింగ్‌ బూత్‌ పరిధిలో మొత్తం 547 ఓట్లు ఉండగా 31 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. ఇక పువర్తి నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. ఇక మరో వాంటెడ్‌ మావోయిస్టు బార్స దేవాది కూడా పువర్తే. హిడ్మా నేతృత్వం వహించిన పీఎల్‌జీఏ ప్లటూన్‌ నంబర్‌. 1లో హిడ్మా తరువాతి స్థానం దేవాదేనని చెబుతారు. దేవాను సుక్కా, దేవన్నగా కూడా పిలుస్తుంటారు. కాగా హిడ్మా తలపై మొత్తంగా రూ.1.80 కోట్ల రివార్డు ఉంది. ఛత్తీ్‌సగడ్‌ రూ.40లక్షలు, మహారాష్ట్ర రూ.50లక్షలు, ఒడిశా రూ.25లక్షలు, ఏపీ రూ.25లక్షలు, తెలంగాణ రూ.25లక్షలు, మధ్యప్రదేశ్‌ రూ.25 లక్షలు చొప్పున రివార్డులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే పువర్తిలో నెలకొన్న పరిస్థితిని కవర్‌ చేసేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి మొదలైన ప్రయాణం.. ఛత్తీ్‌సగఢ్‌ బీజాపూర్‌ జిల్లా పామేడు, కౌరుగట్టు, కొండపల్లి, చిన్నబట్టిగూడెం గ్రామం మీదుగా సుమారు 3 గంటల పాటు అడవిలో ప్రయాణించి పువర్తికి చేరుకున్నారు. అడవుల్లో అడుగడుగునా బలగాలు కనిపించగా.. ఎటు వెళ్తున్నారు.. ఎక్కడ నుంచి వస్తున్నారు..? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

సగం ఇళ్లకు తాళాలే..

పువర్తిలోని 8 వీధులుండగా.. బండిపారలో హిడ్మా ఇల్లు ఉంది. అన్ని వీధుల్లో సగం ఇండ్లకు తాళాలే కనిపించాయి. కొందరు ఇళ్ల వద్ద దిగాలుగా కూర్చుని ఉన్నారు. మరికొంతమంది హిడ్మా ఇంటి వద్దకు చేరుకుని చెట్ల కింద కూర్చుని కనిపించారు. బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహం పువర్తికి చేరుకోలేదు. నడవలేని పరిస్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు.. ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ కనిపించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం సెల్‌ఫోన్‌లో చూశామని, ఫొటో చూశాక హిడ్మానే అని పోలీసులకు చెప్పామని గ్రామస్థులు చెప్పారు. హిడ్మా మృతదేహం గురువారం తీసుకొస్తారని తెలిపారు.

Updated Date - Nov 20 , 2025 | 05:10 AM