Share News

Former IAS Officer Praveen Prakash: మీ విషయంలో తప్పు చేశాను

ABN , Publish Date - Nov 13 , 2025 | 03:58 AM

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ క్షమాపణలు చెప్పారు.

Former IAS Officer Praveen Prakash: మీ విషయంలో తప్పు చేశాను

  • ఏబీవీ, జాస్తి కృష్ణకిశోర్‌కు ప్రవీణ్‌ ప్రకాశ్‌ క్షమాపణ

  • వారిపై చర్యల ఫైళ్లను తిరస్కరించి ఉండాల్సింది

  • నైతికత, విలువల కోణంలో చూడాల్సింది

  • అలా చేయనందుకు ‘పశ్చాత్తాపం’తో వీడియో

అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ క్షమాపణలు చెప్పారు. జగన్‌ హయాంలో తాను జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో వారి పట్ల వ్యవహరించిన తీరుకు పశ్చాత్తాపపడుతూ బహిరంగ క్షమాపణలతో తాజాగా ఆయన వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రవీణ్‌ ప్రకాశ్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తానెప్పుడూ చట్టవిరుద్ధంగా ఫైలు రాయలేదన్నారు. జూనియర్లకు, కింది ఉద్యోగులకు కూడా చట్టవిరుద్ధంగా వ్యవహరించాలని ఎన్నడూ చెప్పలేదని తెలిపారు. ‘నాపై సమాజానికి ఉన్న అంచనాల మేరకు పనిచేయలేకపోయాను. అందుకే ట్రోలింగ్‌కు గురయ్యాను. 2020లో జీఏడీకి పొలిటికల్‌ విభాగానికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశాను. ఆ సమయంలో డీజీపీ కార్యాలయం నుంచి నాకో ఫైలు వచ్చింది. అప్పటి అదనపు డీజీ ర్యాంకు అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఆ సమస్య ఎలా ఉందంటే.. సివిల్‌ సర్వీసెస్‌ కండక్ట్‌ రూల్స్‌ ప్రకారం.. ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత పనుల కోసం వాడితే ప్రభుత్వానికి తెలియజేసి అదనంగా డబ్బు చెల్లించాలి. కానీ మేం 24 గంటలూ ప్రభుత్వ పనే చేస్తుంటాం. మొబైల్‌ ద్వారా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాం.


ఇంట్లోఉన్నా, బయట ఉన్నా పనిచేస్తూనే ఉంటాం. అందుకే మా జీవితాల్లో ప్రభుత్వం, వ్యక్తిగతం అనే గీతలు లేవు. మాల్‌లో ఉన్నా, వెకేషన్‌లో ఉన్నా.. ఇంకెక్కడ ఉన్నా 24గంటలూ అందుబాటులోనే ఉంటాం. నెలకు 300 కిలోమీటర్లు వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ కారు వాడితే 30 ఏళ్లకు లక్ష కిలోమీటర్లు అవుతుంది. మీ కెరీర్‌లో మొత్తం లక్ష కిలోమీటర్లు ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వాడారు.. కాబట్టి పెనాల్టీతో రూ.40 లక్షలు చెల్లించాలంటే చట్ట ప్రకారం అది కరెక్టే. చట్టవిరుద్ధమైన పనులు చేసినట్లే! ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా ఈ కేసులో ఊరట లభించదు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే అది తప్పేమీ కాదు. ఇలాంటి సమస్యే ఏబీ వెంకటేశ్వరరావు ఫైలులో ఉంది. నా కంటే 5 ఏళ్లు సీనియర్‌ అయిన ఐపీఎస్‌ అధికారి ఫైలు చూసి టెన్షన్‌ పడ్డాను. చట్ట ప్రకారం ఇది కరెక్టా కాదా అన్న లైన్‌లో పరిశీలించాను. చట్టవిరుద్ధంగా, సివిల్‌ సర్వీసెస్‌ కండక్ట్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉందని.. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని ఆ ఫైలులో రాశాను. ఆ ఫైలు పరిశీలించడానికి కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఉపకార్యదర్శి ఉన్నారు. ఒక ముఖ్య కార్యదర్శిగా ఆ సమస్యను నేను విలువలు, నైతికత కోణంలో చూడాల్సింది.


క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఆ ఫైలును తిరస్కరించాల్సింది. అలా చేయకపోవడం కరెక్టు కాదనే ఇప్పుడు అనిపిస్తోంది. ప్రస్తుత సమాజం ఏ సమస్యనైనా మొదట విలువలు, నైతికత కోణాల్లో పరిశీలించాలని కోరుకుంటున్నారు. జాస్తి కృష్ణకిశోర్‌ ఫైలు విషయంలోనూ ఇదే తప్పు చేశాను. ఈ రెండు ఫైళ్లను నేను నైతికత, విలువల కోణంతో చూసి నిర్ణయం తీసుకోవాల్సింది. అప్పుడు చేయలేదు. అందుకే ఏబీవీ, కృష్ణకిశోర్‌కు ఫోన్‌చేసి వారికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాను. నాలో ఉన్న అపరాధ భావన పోగొట్టుకోవడానికి బహిరంగంగా కూడా వారిద్దరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ముగించారు.

Updated Date - Nov 13 , 2025 | 04:00 AM