ఫైబర్‌నెట్ కేసులో నా వాదనలు వినండి: గౌతం రెడ్డి
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:42 AM
ఫైబర్‌నెట్ కార్పోరేషన్ కేసులో తీర్పు ఇచ్చే ముందు తన వాదనను వినాలని కోరుతూ ఆ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి...
విజయవాడ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్ కార్పోరేషన్ కేసులో తీర్పు ఇచ్చే ముందు తన వాదనను వినాలని కోరుతూ ఆ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ వేశారు. 2014-19 మధ్య ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందని, కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని వైసీపీ ప్రభుత్వంలో కేసు నమోదైంది. ప్రతిపక్ష హోదాలో ఉండగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నాడు సీఐడీకి ఫిర్యాదు చేసిన ఫైబర్‌నెట్ కార్పోరేషన్ ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించాల్సిఉన్న నేపథ్యంలో గౌతంరెడ్డి పిటిషన్ వేశారు. ఇది శుక్రవారం బెంచ్ మీదకు రానుంది.