Share News

Former Excise Minister Narayanaswamy: అంతా పైవాళ్లకే తెలుసు

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:48 AM

నాకు ఏమీ తెలియదు. అంతా పై వాళ్ల నిర్ణయమే!.. అని వైసీపీ హయాంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణస్వామి స్పష్టం చేసినట్లు తెలిసింది. ముడుపులకు వీలుగా మద్యం పాలసీని మార్చడంలో తన పాత్ర..

Former Excise Minister Narayanaswamy: అంతా పైవాళ్లకే తెలుసు

  • వైసీపీ హయాంలో ఎక్సైజ్‌ మంత్రిగా విధులు

  • పుత్తూరులో 7 గంటలు ప్రశ్నించిన ‘సిట్‌’

  • పాలసీ మార్పు, ముడుపులపై ప్రశ్నలు

  • అన్నీ వాళ్లే నిర్ణయించారన్న స్వామి

  • ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ సీజ్‌

  • బాడీ కెమెరాలు ధరించి ఇంట్లోకి

  • మొత్తం రికార్డు చేసిన అధికారులు

  • మద్యం పాలసీపై నారాయణస్వామి మాట

తిరుపతి/పుత్తూరు/అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ‘నాకు ఏమీ తెలియదు. అంతా పై వాళ్ల నిర్ణయమే!’... అని వైసీపీ హయాంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణస్వామి స్పష్టం చేసినట్లు తెలిసింది. ముడుపులకు వీలుగా మద్యం పాలసీని మార్చడంలో తన పాత్ర, ప్రమేయం ఏమీ లేదని చెప్పినట్లు సమాచారం. లిక్కర్‌ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు శుక్రవారం తిరుపతి జిల్లా పుత్తూరులో మాజీ మంత్రిని 7 గంటల పాటు విచారించారు. దోపిడీకి అనుకూలంగా జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ, ఆన్‌లైన్‌ ఆర్డర్ల విధానం రద్దు, మద్యం కొనుగోళ్లలో డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని పక్కన పెట్టడంపై సిట్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు ‘అన్ని నిర్ణయాలు పైవాళ్లే తీసుకున్నారు’ అంటూ ఒకటే జవాబు పదేపదే చెప్పారని సమాచారం. లిక్కర్‌ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి(ఏ-1), ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేసినా ఆయన స్పందనలో మాత్రం తేడా లేదని తెలిసింది. గత నెలలో నోటీసు ఇచ్చి విచారణకు పిలవగా, అనారోగ్య కారణాలు సాకుగా చూపించి నారాయణస్వామి ముఖం చాటేశారు. అయితే అప్పట్లో నారాయణ స్వామి ఇంటికెళ్లి ప్రశ్నించారు. ఇప్పుడు మరోమారు అదనపు ప్రశ్నలతో పుత్తూరు వెళ్లి ప్రశ్నించారు. ఎక్కువ ప్రశ్నలకు ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ అనే బదులిచ్చినట్లు తెలిసింది.


‘ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టాలన్న పాలసీ నిర్ణయంపై మీరు సంతకం చేశారు కదా.. ఎవరి ఒత్తిడితో చేశారు’ అని అడగ్గా.. ‘అంతా పై వాళ్లే..’ అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రికి తెలియకుండానే మద్యం పాలసీ మార్పుచేర్పులు, అమలు ఎలా సాధ్యమని అధికారులు గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన కుటుంబంలో ఒకరి పాత్ర గురించి కూడా లోతుగా ఆరా తీసినట్టు సమాచారం. మంత్రి హోదాలో ఆయనకు ప్రతినెలా యాభై లక్షల రూపాయల ముడుపులు అందిన విషయం ప్రస్తావించగా.. తనకు ఎవ్వరూ రూపాయి కూడా ఇవ్వలేదని నారాయణస్వామి బదులిచ్చారు. ఒకదశలో తాను డయాలసిస్‌ చేయించుకుని బాధ పడుతున్నానని, ఇబ్బంది పెట్టొద్దని కోరినట్లు తెలిసింది. కాగా, సిట్‌ అధికారులు మరోమారు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


పక్కాగా.. పకడ్బందీగా...

పుత్తూరు పట్టణం ఎస్‌బీఐ కాలనీలో నివసిస్తుదన్న నారాయణస్వామిని ప్రశ్నించేందుకు సిట్‌ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వచ్చారు. జిల్లా ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. సిట్‌ బృందంలో ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో పాటు నలుగురు డీఎస్పీలు ఉన్నారు. ఉదయం 11 గంటలకు బాడీ వోర్న్‌ కెమెరాలతో నారాయణస్వామి ఇంట్లోకి ప్రవేశించారు. మూడంతస్తుంతల భవనంలోని రెండో అంతస్తులో ఆయన కార్యాలయంలో విచారణ ప్రక్రియ కొనసాగింది. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయించారు.

న్యాయవాది హడావిడి

నారాయణ స్వామిని సిట్‌ విచారిస్తున్న సందర్భంలో వైసీపీలో చురుగ్గా ఉండే ఒక న్యాయవాది అక్కడకు చేరుకున్నారు. ‘‘నోటీసు ఇవ్వకుండా ఎలా వచ్చారు? ఆందోళనతో ఆయన అనారోగ్యానికి గురై ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రశ్నల జాబితా ప్రతి నాకూ ఇవ్వండి’’ అని ఆ న్యాయవాది హల్‌చల్‌ చేసినట్లు తెలిసింది. ఆయనకు సిట్‌ అధికారులు కూల్‌గా సమాధానమిచ్చారు. ‘‘రెండు సార్లు నోటీసులిచ్చినా నారాయణస్వామి స్పందించలేదు. అం దుకే మేం రావాల్సి వచ్చింది. అవసరమైతే విజయవాడకు తీసుకెళ్లి అధికారం మాకుంది. ప్రశ్నల జాబితా ప్రతి ఇవ్వడం కుదరదు’’ అన్నట్టు సమాచారం.


ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ సీజ్‌

నారాయణస్వామికి చెందిన ల్యాప్‌ టాప్‌ను, మొబైల్‌ ఫోన్‌ను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు మహిళా వీఆర్వోల సమక్షంలో... పంచనామా నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు... నారాయణస్వామి వాంగ్మూలాన్ని కూడా వారి సమక్షంలోనే నమోదు చేసిట్టు తెలిసింది. వీఆర్వోల రాకతో నారాయణస్వామిని అరెస్టు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దీంతో జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి కొందరు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. ఏడుగంటలపాటు విచారణ ప్రక్రియ కొనసాగినా... వైసీపీ ముఖ్యనేతలెవరూ అటువైపు రాకపోవడం గమనార్హం.

సిట్‌కు సహకరించా: నారాయణస్వామి

సిట్‌ అధికారులకు తాను సహకరించానని నారాయణస్వామి మీడియాకు చెప్పారు. విచారణ సందర్భంగా వారు తనను ఇబ్బంది పెట్టలేదన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూల్‌గా సమాధానం చెప్పానన్నారు. భవిష్యత్తులో మళ్లీ వచ్చి విచారించినా సహకరిస్తానన్నారు. సిట్‌ అధికారులు ‘నార్మల్‌ ప్రాసె్‌స’లో భాగంగా విచారణకు వచ్చారని, వారికి సహకరించాం కాబట్టి భయపడాల్సిన పనిలేదని నారాయణస్వామి కుమార్తె, జీడీనెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి కృపాలక్ష్మి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సిట్‌ అధికారులు తమను ఇబ్బంది పెట్టలేదన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 04:51 AM