Share News

TTD Parakamani Theft Case: మీకు తెలిసే రాజీ జరిగిందా?

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:33 AM

తిరుమలేశుడి పరకామణిలో చోరీ కేసులో సీఐడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, విజిలెన్స్‌ సెక్యూరిటీ విభాగం మాజీ చీఫ్‌ సీవీఎ్‌సవో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న నరసింహ కిశోర్‌ను దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారు...

TTD Parakamani Theft Case: మీకు తెలిసే రాజీ జరిగిందా?

  • అయిపోయాక తెలిసిందా.. ఎవరు ఒత్తిడి చేశారు?

  • టీటీడీ పరకామణి చోరీ కేసులో..నాటి ఈవో ధర్మారెడ్డికి సీఐడీ ప్రశ్నలు

  • నేడు సీఐడీ ముందుకు వైవీ సుబ్బారెడ్డి

అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడి పరకామణిలో చోరీ కేసులో సీఐడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, విజిలెన్స్‌-సెక్యూరిటీ విభాగం మాజీ చీఫ్‌ (సీవీఎ్‌సవో), ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న నరసింహ కిశోర్‌ను దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారు. ‘టీటీడీలో దొంగతనానికి పాల్పడినవారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు.. దొంగలించిన వ్యక్తి అంతకు కొన్ని రెట్లు ఎక్కువ చెల్లిస్తానంటే వదిలేసే అవకాశం ఉందా.. విదేశీ డాలర్లు దొంగలించి పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవికుమార్‌తో ఆస్తులు రాయించుకునే విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి.. అప్పట్లో ఈ కేసుపై లోక్‌ అదాలత్‌లో మీకు తెలిసే రాజీ జరిగిందా.. జరిగిపోయిన తర్వాత తెలిసిందా.. ఎవరు ఒత్తిడి చేశారు..’ అని ధర్మారెడ్డిని అడిగినట్లు తెలిసింది. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని, దాతలు ముందుకొచ్చినప్పుడు ఆ వివరాలు పాలకమండలి ఎజెండాలో చూపించి.. దాని ఆమోదంతోనే తదుపరి చర్యలు చేపడతామని ఆయన బదులిచ్చినట్లు సమాచారం. విజయవాడ తులసీనగర్‌లోని సీఐడీ కార్యాలయానికి బుధవారం ఉదయం పది గంటలకు ధర్మారెడ్డి చేరుకోగా.. అధికారులు ఆయన్ను ఐదు గంటలు ప్రశ్నించారు. ఆ తర్వాత రెండు గంటల పాటు నరసింహ కిశోర్‌ను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పరకామణి(హుండీ లెక్కింపు)లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన డాలర్ల దొంగతనం వ్యవహారంపై హైకోర్టు ఆదేశాల మేరకు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలోని సీఐడీ బృందం పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి కేంద్రంగా నిందితుడు రవికుమార్‌తో పాటు నాటి టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, ఈవో ధర్మారెడ్డి తదితరులను, హైదరాబాద్‌లో అప్పటి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే ప్రశ్నించారు. దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో విచారణను విజయవాడకు మార్చారు. ధర్మారెడ్డిని, నరసింహ కిశోర్‌ను ప్రశ్నించేందుకు అయ్యన్నార్‌ మంగళవారం రాత్రి ఆగమేఘాలపై బెజవాడ చేరుకున్నారు. రవికుమార్‌ భార్య పేరుతో ఉన్న ఆస్తులను టీటీడీకి గిఫ్ట్‌ డీడ్‌ ఇచ్చేందుకు ఆయన చేసిన వినతిని పాలకమండలి భేటీలో టేబుల్‌ ఎజెండాగా పెట్టిన తర్వాతే రిజిస్టర్‌ చేయించినట్లు మాజీ ఈవో వెల్లడించారని తెలిసింది. లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకుంటుంటే.. మీకెవరూ చెప్పలేదా అని సీఐడీ ప్రశ్నించగా.. ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇప్పటి వరకూ పలువురిని విచారించి సేకరించిన ఆధారాలను చూపించి ప్రశ్నించినట్లు సమాచారం.


స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ నోట్లు ఎన్ని?

పరకామణిలో దొంగలించిన విదేశీ కరెన్సీ నోట్లలో రవికుమార్‌ నుంచి ఎన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అప్పటి ఏవీఎ్‌సవో సతీశ్‌ కుమార్‌కు చెప్పింది మీరేనా.. పోలీసు ఫిర్యాదులో 9 యూఎస్‌ డాలర్ల నోట్లు (ఒక్కొక్కటి వంద డాలర్లు విలువ) మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లుగా ఉంది.. కానీ 112 స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. కచ్చితంగా ఎన్ని అనేది మీకు తెలుసా.. పరకామణిలో దొంగతనం చేసి పట్టుబడిన దొంగతో.. ఫిర్యాదు చేసిన ఏవీఎ్‌సవో సతీశ్‌కుమార్‌ లోక్‌ అదాలత్‌లో రాజీ పడుతుంటే మీరు అభ్యంతరం ఎందుకు చెప్పలేదు.. ఒక దొంగతనం కేసులోని నిందితుడు రూ.కోట్ల ఆస్తులు విరాళంగా ఇస్తే తీసుకోవడం సబబేనా.. అందుకు ఆలయ నిబంధనలు అభ్యంతరం చెప్పవా..’ అని నరసింహ కిశోర్‌ను సీఐడీ ప్రశ్నించినట్లు తెలిసింది. రవికుమార్‌ దొంగతనాన్ని గుర్తించడం, పట్టుకుని ఫిర్యాదు చేయడం వరకూ విజిలెన్స్‌ సక్రమంగానే వ్యవహరించిందని ఆయన బదులిచ్చారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు ఎలా చేశారు.. చార్జిషీటులో ఏం రాశారు.. లోక్‌ అదాలత్‌లో ఎందుకు రాజీ పడ్డారు.. అనే విషయాలు తమ పరిధిలోకి రావని వివరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని గురువారం మరోసారి సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆయన ఉదయాన్నే విజయవాడ రానున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 27 , 2025 | 05:33 AM