Former CM Jagan: గూగుల్ డేటా సెంటర్‌ను స్వాగతిస్తున్నా
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:01 AM
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును మాజీ సీఎం జగన్ ఎట్టకేలకు స్వాగతించారు. తాడేపల్లి నివాస ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సానుకూల మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
రాబోయేది క్వాంటమ్ ఏఐ యుగం
డేటా సెంటర్‌తో ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది
పర్యావరణానికి ముప్పు ఉండదు
సెంటర్‌కు నా హయాంలోనే అంకురార్పణ
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును మాజీ సీఎం జగన్ ఎట్టకేలకు స్వాగతించారు. తాడేపల్లి నివాస ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సానుకూల మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు నడుస్తున్నదేగాక రాబోయేది కూడా క్వాంటమ్ ఏఐ యుగమేనని తెలిపారు. ఇటువంటి సమయంలో రాష్ట్రానికి డేటా సెంటర్లు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని, ఈ సెంటర్ల వల్ల ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుందన్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. పర్యావరణ ముప్పు ఉంటుందని ఎవరంటున్నారో వాళ్లనే ఆ విషయం అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా విలేకరులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తామెప్పుడూ గూగుల్ డేటా సెంటర్‌ను వ్యతిరేకించలేదన్న ఆయన, డేటా సెంటర్‌ను తమ హయాంలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. డేటాసెంటర్‌ను అదానీ గ్రూపు నిర్మిస్తుందని, ఆ తర్వాత గూగుల్ ఇక్కడకు వస్తుందని తెలిపారు. తానే డేటా సెంటరును తెచ్చినట్లుగా సీఎం చంద్రబాబు చెబుతుండటం సరికాదని, అదానీకి ఆయన కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని విమర్శించారు. ‘ఎఫిషియెన్సీ వీక్.. వేరేవాళ్ల క్రెడిట్ చోరీ చేయడంలో పీక్’ అంటూ చంద్రబాబుపై అవాకులుచెవాకులు మాట్లాడారు. ‘‘2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కు విశాఖలో శంకుస్థాపన చేశాం. సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను సింగపూర్ నుంచి తీసుకువచ్చే కార్యక్రమానికి అప్పుడే అంకురార్పణ జరిగింది’’ అని తెలిపారు. చంద్రబాబు పాలనను గాలికి వదిలేశారని, ఒక యాడ్ ఏజెన్సీ రాష్ట్రంలో నడుస్తున్నట్లుందని జగన్ విమర్శించారు. తనను సైకో అంటూ విమర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ రోజన అసెంబ్లీకి తాగివచ్చారని, అలాంటి వ్యక్తిని స్పీకర్ ఎలా అనుమతించారో తెలియట్లేదన్నారు.
జనార్దనరావును జయచంద్రారెడ్డిని వదిలేశారెందుకు
రాష్ట్రమంతా కల్తీ మద్యం పారుతోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తమ వారెక్కడ నుంచి వస్తున్నా విమానాశ్రయంలోనే పట్టుకుని అరెస్టు చేసే పోలీసులు... తంబళ్లపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన జయచంద్రారెడ్డిని మాత్రం ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మరో నిందితుడు జనార్దనరావును ఎందుకు వదిలేశారంటూ ఆయన అసహనం వ్యక్తంచేశారు. తనకు అనుకూలుడైన అధికారిని సిట్‌కు అధిపతిగా నియమించారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే నకిలీ మద్యం మూలాలన్నీ బయటకు వస్తాయన్నారు.