Jagan Appears in CBI Court for Europe Trip Case: మీరేమైనా చెప్పదలచుకున్నారా?
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:17 AM
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడి(ఏ-1)గా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఉదయం 11.50 నిమిషాలకు ఆయన అడుగుపెట్టారు. దాదాపు 25 నిమిషాలు ఉన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో న్యాయవాదులు....
యూరప్ పర్యటన వ్యవహారంలోకోర్టుకు హాజరైన మాజీ సీఎం
రికార్డు చేసుకున్న న్యాయస్థానం
కోర్టు హాలులో 25 నిమిషాలు గడిపిన జగన్
ఎదురుపడినా పలుకరించుకోని అన్నాచెల్లెలు
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడి(ఏ-1)గా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఉదయం 11.50 నిమిషాలకు ఆయన అడుగుపెట్టారు. దాదాపు 25 నిమిషాలు ఉన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో న్యాయవాదులు, ఇతరులు కోర్టులోకి రావడంతో విపరీతంగా తోపులాట జరిగింది. న్యాయవాదులు, ఇతరులు అధిక సంఖ్యలో రావడంతో లోపల కోర్టు హాలు, బయట కారిడార్లు కిక్కిరిసిపోయాయి. వారందరినీ అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. కేసులు లేని న్యాయవాదులు బయటకు వెళ్లాలని కోర్టు సిబ్బంది పదే పదే విజ్ఞప్తి చేసినా హాలు నుంచి ఎవరూ వెళ్లలేదు. ఆ పరిస్థితుల్లోనే జగన్ అక్రమాస్తులకు సంబంధించిన దాల్మియా సిమెంట్స్ కేసులో కొద్దిసేపు వాదనలు జరిగాయి. ఆ తర్వాత జగన్‌కు సంబంధించిన అప్లికేషన్ విచారణకు రావడంతో ఆయన న్యాయాధికారి టి.రఘురాం ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ‘మీరేమైనా చెప్పదలచుకున్నారా’ అని న్యాయాధికారి ఆయన్ను ప్రశ్నించారు. ఏమీ లేదని జగన్ సమాధానం ఇచ్చారు. ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడాన్ని న్యాయాధికారి రికార్డు చేశారు. యూరప్ పర్యటనకు సంబంధించిన అప్లికేషన్‌లో విచారణను ముగించారు. అనంతరం జగన్ కోర్టు హాలు నుంచి నిష్క్రమించారు. ఇటీవల యూరప్ ట్రిప్‌కు వెళ్లడానికి జగన్‌కు అనుమతి ఇచ్చిన కోర్టు.. తిరిగి వచ్చాక వ్యక్తిగతంగా రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాను వస్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని జగన్ దరఖాస్తు చేయగా కోర్టు అంగీకరించలేదు. కోర్టుకు రావలసిందేనని స్పష్టంచేసింది. దీంతో దాదాపు ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టులో ఆయన అడుగుపెట్టారు.
పలకరించుకోని జగన్, సునీత
కాగా.. కోర్టు హాలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జగన్ విజిటర్స్ కుర్చీల వైపు కూర్చోగా.. ఎదురుగా సీబీఐ న్యాయవాదులు కూర్చునే చోట.. హత్యకు గురైన ఆయన చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె, ఆయన చెల్లెలు నర్రెడ్డి సునీతారెడ్డి కూర్చున్నారు. ఆ తర్వాత జగన్ జడ్జి ముందుకు వచ్చినప్పుడు.. ఎదురుగా కూర్చున్న సునీతను చూశారు. అయినా ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు.