Share News

Judicial Remand: ఐపీఎస్‌ సంజయ్‌ లొంగుబాటు

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:10 AM

సీఐడీ మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం లొంగిపోయారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వైసీపీ హయాంలో ఆయన సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన సమయంలో...

Judicial Remand: ఐపీఎస్‌ సంజయ్‌ లొంగుబాటు

  • ఫైర్‌ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌

  • వారం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్‌

  • మధ్యంతర బెయిల్‌ కోసం సంజయ్‌ వినతి

విజయవాడ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం లొంగిపోయారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వైసీపీ హయాంలో ఆయన సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన సమయంలో ఎస్సీ, ఎస్టీలకు అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని ఏసీబీ అభియోగం మోపింది. అలాగే ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల(ఎన్‌వోసీ) జారీలోనూ, వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనలోనూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై సంజయ్‌ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందినప్పటికీ, సుప్రీంకోర్టు కొట్టివేసింది. మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారం తన న్యాయవాదులతో కలిసి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు వచ్చారు. న్యాయాధికారి పి.భాస్కరరావు సంజయ్‌కు వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా.. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు సంజయ్‌ను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని సంజయ్‌ తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనకు ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిందంటూ సంబంధిత రిపోర్టులను కోర్టుకు సమర్పించారు. మధ్యంతర బెయిల్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని.. కస్టడీపై కౌంటర్‌ వేయాలని సంజయ్‌ తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ న్యాయాధికారి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు.. జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంజయ్‌కు జైలు అధికారులు 7971 నంబర్‌ను కేటాయించారు.


దళితుల సొమ్ము స్వాహా

దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్వాహా చేసిన సీఐడీ మాజీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌.. అంతకు ముందు అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు..ఎన్‌వోసీలు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్‌ల కొనుగోళ్లలో రూ. 1.19 కోట్ల అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీనిపై టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జరిపిన విచారణలో ఆయన అవినీతి బాగోతం బయటపడింది. సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మరోవైపు అగ్నిమాపక శాఖలో కూడా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి బిడ్‌ రిగ్గింగ్‌, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాత ధోరణి అవలంబించినట్లు తేలింది. సౌత్రికా టెక్నాలజీస్‌కు యాప్‌ అభివృద్ధి పేరుతో బిల్లులు చెల్లించి రూ.59.93 లక్షలు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. ‘అగ్ని-ఎన్‌వోసీ’ వెబ్‌సైట్‌ రూపకల్పన, యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కోసం 2023 జనవరిలో టెండర్లు పిలిచారు. ముందే ఎంపిక చేసుకున్న మూడు సంస్థలతో బిడ్లు వేయించి ఎల్‌-1గా సౌత్రికా టెక్నాలజీస్‌ బిడ్‌ను ఖరారు చేశారు. మొత్తం రూ.2.29 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో పనులు జరగకుండానే రూ.59.93 లక్షలు చెల్లించేశారు. మార్కెట్‌ ధరకన్నా ఎక్కువకు ట్యాబ్‌ల కొనుగోలు, బిడ్‌ వేసిన సంస్థకు నిబంధనలు అతిక్రమించి బిల్లులు చెల్లించడం వెనుక అవినీతి జరిగిందని విజిలెన్స్‌ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వగా, ప్రభుత్వ విజ్ఞప్తితో దానిని సుప్రీంకోర్టు రద్దుచేసింది. లొంగుబాటుకు 3 వారాలు గడువిచ్చింది. దరిమిలా మంగళవారం ఏసీబీ కోర్టులో ఆయన లొంగిపోయారు.

Updated Date - Aug 27 , 2025 | 04:12 AM