Former CID ADG Sanjay: నాకేం తెలీదు.. సిబ్బందే అంతా చేశారు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:59 AM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఆ వర్గాలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను స్వాహా చేసిన కేసులో సీఐడీ మాజీ ఏడీజీ సంజయ్ ఏసీబీ విచారణలో పాతపాటే పాడినట్లు తెలిసింది.
ఏసీబీ కస్టడీలో సంజయ్ బుకాయింపు
ఆధారాలు చూపితే మౌనం.. నేడు మరింత లోతుగా విచారణ
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఆ వర్గాలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను స్వాహా చేసిన కేసులో సీఐడీ మాజీ ఏడీజీ సంజయ్ ఏసీబీ విచారణలో పాతపాటే పాడినట్లు తెలిసింది. అగ్నిమాపక శాఖలో ఎన్‌వోసీలు ఆన్‌లైన్‌లో జారీకి మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్‌ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడినట్లు తేలిన వ్యవహారంలోనూ ఆయన నోరు విప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో ఆయన ఒకరు. దళితులకు ఎస్‌సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించే పేరుతో అవగాహన సదస్సులు నిర్వహించకుండానే రూ.1.19 కోట్లు క్రిత్వాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు చెల్లించేశారు. మరోవైపు అగ్నిమాపక శాఖలో ‘అగ్ని-ఎన్‌వోసీ’ వెబ్‌సైట్ రూపకల్పన, యాప్ అభివృద్ధి పేరుతో సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ.2.29కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టి, పనులు జరగకుండానే రూ.59.93 లక్షలు చెల్లించేశారు. ఈ రెండు అవినీతి భాగోతాలపై కేసు నమోదు చేసి కోర్టు అనుమతితో సంజయ్‌ని కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఇటీవల మూడు రోజులు విచారించినా అంతా సిబ్బందే చేశారని సంజయ్ చెప్పా రు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించాలంటూ సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు వారిచ్చిన వాంగ్మూలాలు ముందుంచడంతో నీళ్లు నమిలినట్లు తెలిసింది. విచారణకు సహకరించకపోవడంతో బుధవారం మరోమారు కస్టడీకి తీసుకుని ప్రశ్నించినా పాత పాటే పాడుతున్నారు. ఆధారాలు చూపించి ప్రశ్నించగా మౌనం వహించినట్లు తెలిసింది. గురువారం మరోసారి ప్రశ్నించే వీలుంది.