Former CI Shankarayya: సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:08 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పులివెందుల మాజీ సీఐ శంకరయ్య లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని...
నా పరువుకు భంగం కలిగించారు
1.45 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి
ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపిన సీఐ శంకరయ్య
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుకు పులివెందుల మాజీ సీఐ శంకరయ్య లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో శంకరయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 18న న్యాయవాది ధరణేశ్వర్‌రెడ్డి ద్వారా ఆయన ఈ నోటీసును పంపించారు. ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు (2019 మార్చి 15) ఘటనా స్థలంలో ఆధారాలను స్థానిక సీఐ సమక్షంలోనే నిందితులు ధ్వంసం చేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయి. వాటివల్ల నా పరువుకు భంగం కలిగింది. అసెంబ్లీలో నాకు క్షమాపణలు చెప్పాలి. నా పరువుకు భంగం కలిగించినందుకు రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలి’ అంటూ శంకరయ్య ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా, వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కళ్ల ముందు రక్తపు మరకలు కనిపించినా హత్య కేసు నమోదు చెయ్యకపోవడాన్ని తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించింది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు శంకరయ్య వాంగ్మూలం ఇస్తూ... ‘‘కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారు. ‘వివేకా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపవద్దు. నుదుటిపై గాయాలున్న విషయం ఎవరికీ చెప్పొద్దు’ అని హెచ్చరించారు’’ అని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని కోర్టులో చెబుతానని సీబీఐకి చెప్పిన శంకరయ్య ఆ తర్వాత జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు రాకుండా దాట వేశారు. ఇది జరిగిన వారం రోజుల్లోనే(2021 అక్టోబరు 6న) అప్పటి వైసీపీ ప్రభుత్వం శంకరయ్యపై సస్పెన్షన్ ఎత్తేసింది. అవాక్కైన సీబీఐ అధికారుల ఆ వారం రోజుల్లో శంకరయ్య ఎవరెవరితో మాట్లాడారనే విషయమై ఆరా తీసింది. కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్‌లో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉన్న శంకరయ్య తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లీగల్ నోటీసు పంపడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.