Share News

కుమార్తె పెళ్లి పత్రికలు పంచుతూ అనంతలోకాలకు..

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:58 AM

మరో పద్నాలుగు రోజుల్లో కుమార్తె పెళ్లి.. అందరూ ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. బంధువులను ఆహ్వానించే బాధ్యతను ఇంటి పెద్ద అయిన తండ్రి తీసుకున్నాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు తమ్ముడుతో కలిసి ఉదయమే కలిదిండి బయలుదేరాడు. మరో బైక్‌ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెళ్లి ఇంటి తీవ్ర విషాదం నింపింది.

కుమార్తె పెళ్లి పత్రికలు పంచుతూ అనంతలోకాలకు..

-పెడన మండలం బల్లిపర్రు వద్ద రోడ్డు ప్రమాదం

-మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన వ్యక్తి మృతి

-నవంబరు 13న కుమార్తె వివాహం

-పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కలిదిండి వెళ్తుండగా ఘటన

- కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

మరో పద్నాలుగు రోజుల్లో కుమార్తె పెళ్లి.. అందరూ ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. బంధువులను ఆహ్వానించే బాధ్యతను ఇంటి పెద్ద అయిన తండ్రి తీసుకున్నాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు తమ్ముడుతో కలిసి ఉదయమే కలిదిండి బయలుదేరాడు. మరో బైక్‌ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెళ్లి ఇంటి తీవ్ర విషాదం నింపింది.

పెడన/మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

పెడన మండలం బల్లిపర్రు గ్రామంలోని రైస్‌మిల్లు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మచిలీపట్నం నగరంలోని బలరామునిపేటకు చెందిన మాదిరెడ్డి జయవీరప్రతాప్‌ (60) మృతి చెందాడు. నవంబరు 13న జరగనున్న తన కుమార్తె వివాహానికి బంధువులను ఆహ్వానించేందుకు జయవీరప్రతాప్‌ తన తమ్ముడు వీరాంజనేయులుతో కలిసి గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై కలిదిండి మండలం పెదలంక బయలుదేరాడు. మార్గమధ్యంలోని బల్లిపర్రు రైస్‌ మిల్లు వద్ద జయవీరప్రతాప్‌ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వస్తున్న చిలుకోటి సుబ్బారావుకు చెందిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జయవీరప్రతాప్‌ రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ద్విచక్ర వాహనంపై వెనుక వైపు కూర్చున్న జయవీరప్రతాప్‌ తమ్ముడు వీరాంజనేయులుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయవీరప్రతాప్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బలరామునిపేటలో జయవీరప్రతాప్‌ బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. కాగా, మాదిరెడ్డి జయవీరప్రతాప్‌ రోల్డుగోల్డు నగలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య రత్నకుమారి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిని బాగా చదివించాడు. పెద్ద కుమార్తె మోహితకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో వివాహం నిశ్చయించారు. చిన్నకుమార్తె దివ్య కేరళలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంది.

Updated Date - Oct 31 , 2025 | 12:58 AM