ఏసీబీ వలలో చిక్కిన అటవీశాఖ అధికారి
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:10 AM
టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు రూ.18 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు.
- టింబర్ డిపో లైసెన్సు రెన్యువల్‌కు రూ.18 వేలు డిమాండ్
- లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
(ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం)
టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ చేసేందుకు రూ.18 వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన వనం రవీంద్రనాథ్ మచిలీపట్నంలో శ్రీజ టింబర్ డిపో నడుపుతున్నారు. ఈ టింబర్ డిపో లైసెన్స్ గడువు ముగియడంతో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి జి.జయప్రకాష్ చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో జయప్రకాష్ రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరకు రూ.18వేలు ఇస్తే టింబర్ డిపో లైసెన్స్‌ను పునరుద్ధరిస్తామని అటవీశాఖ అధికారి బేరం కురుద్చుకున్నారు. లంచం ఇవ్వటం ఇష్టంలేని రవీంద్రనాథ్ ఈ విషయంపై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావుతోపాటు మరో 15 మంది సిబ్బంది మంగళవారం రాత్రి ఆనంద్‌పేటలోని జిల్లా అటవీశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం టింబర్ డిపో యజమాని రవీంద్రనాథ్‌కు పౌడర్ చల్లిన రూ.18వేల నగదును ఇచ్చి అటవీశాఖ అధికారి వద్దకు పంపారు. నగదు తీసుకున్న అధికారిని ఏసీబీ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నగదును స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారి చేతులను రసాయనాలతో కడిగి లంచం తీసుకున్నట్లుగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులకు పట్టుబడిన జి.జయప్రకాష్ 2015లో రాజమండ్రిలో అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుని పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.