Forensic Lab Officials: ఫేస్ ఐడీతో లాక్ ఓపెన్
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:12 AM
వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేశ్ నాయుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఫేస్ ఐడీ ద్వారా ఓపెన్ చేశారు.
వెంకటేశ్ నాయుడి ఫోన్ ఓపెన్ చేసిన అధికారులు
మద్యం స్కాంలో కీలక సమాచారం వెలుగులోకి?
విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేశ్ నాయుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఫేస్ ఐడీ ద్వారా ఓపెన్ చేశారు. ఈ కేసులో నగదు లావాదేవీలు సహా సమాచారానికి సంబంధించిన వ్యవహారాల విషయంలో వెంకటేశ్ నాయుడి ఫోన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఓపెన్ చేసేందుకు ఏసీబీ కోర్టు నుంచి అనుమతి పొందారు. ఈ క్రమంలో సిట్ అధికారులు విజయవాడ జైల్లో ఉన్న వెంకటేశ్ నాయుడిని మంగళవారం ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఆయనను ఎఫ్‌ఎస్ఎల్‌కు తీసుకెళ్తున్నామని న్యాయాధికారి పి. భాస్కరరావుకు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు వివరించారు. అయితే, వెంకటేశ్ తరఫు న్యాయవాదిని కూడా తీసుకెళ్లాలని న్యాయాధికారి ఆదేశించారు. అనంతరం వెంకటేశ్ నాయుడిని అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వెంకటేశ్ నాయుడి ఫేస్ ఐడీ ద్వారా సెల్‌ఫోన్ లాక్‌ను తీశారు. అందులోని గుట్టును బయటకు లాగుతున్నారు. ఫోన్ లాక్ తెరిచాక వెంకటేశ్‌ను తిరిగి జైలుకు తరలించారు.