Share News

Guntur: విధి ఆడిన వికృత క్రీడ..

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:13 AM

ఆ పిల్లాడికి ఆటలంటే పిచ్చి.. ఫుట్‌బాల్‌కు అయితే వీరాభిమాని.. క్రీడల్లో అమోఘంగా రాణించి హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో సీట్‌ సాధించాడు.

Guntur: విధి ఆడిన వికృత క్రీడ..

  • రోడ్డు ప్రమాదంలో వెన్నువిరిగి 14 ఏళ్లుగా మంచంలోనే

  • ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురుచూపు

గుంటూరు (విద్య), ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఆ పిల్లాడికి ఆటలంటే పిచ్చి.. ఫుట్‌బాల్‌కు అయితే వీరాభిమాని.. క్రీడల్లో అమోఘంగా రాణించి హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో సీట్‌ సాధించాడు. దాదాపు ఏడేళ్లపాటు (10వ తరగతి వరకు) అక్కడే చదివి... స్పోర్ట్స్‌ స్కూల్‌ తరఫున జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌గా ఎదగాలని ఎన్నో కలలుకన్న ఆ విద్యార్థిపై విధి చిన్నచూపు చూసింది. 14 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి.. ఇప్పటికీ కోలుకోలేకపోయాడు. ప్రమాదంలో వెన్ను విరిగి నడుము కిందనుంచి, కాళ్ల వరకూ స్పర్శ లేకుండా మంచంపై జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. గుంటూరు హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన దుగ్గిరాల ఎఫ్రాయిమ్‌ దత్తుబాబు దీనస్థితి ఇది..!


సర్టిఫికెట్ల కోసం వెళ్లి.. జీవచ్ఛవంలా..: ఎఫ్రాయిమ్‌ పదో తరగతి పాస్‌ అయిన తర్వాత 2012లో హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు సర్టిఫికెట్ల కోసం వెళ్లాడు. తిరిగి ఆటోలో వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైంది. తల్లిదండ్రులు ఎన్ని ఆస్పత్రులు తిప్పినా కనీసం లేచి నిలబడలేకపోయాడు. ఫలితంగా 14 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. నడుము నుంచి కింద అరికాళ్ల వరకు స్పర్శ లేదు. రక్త ప్రసరణ సక్రమంగా జరగక ఆ ప్రాంతం మొత్తం నల్లగా కమిలిపోయింది. ఒకవైపే తిరిగి పడుకోవడంతో మెడ భాగం నుంచి కాళ్ల వరకు పుండ్లు పడ్డాయి. ఆరుపదుల వయసు దాటిన తల్లి రూతురాణి ఓవైపు కుటుంబాన్ని సంరక్షించుకుంటూనే మరోవైపు కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పెద్ద కుమారుడు కరోనాతో మరణించగా చిన్న కుమారుడిని ఈ స్థితిలో చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఎఫ్రాయిమ్‌ తండ్రి విజయ దత్తుబాబు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. దీంతో ఎఫ్రాయిమ్‌కు పెన్షన్‌ కూడా అందని స్థితి. తన తండ్రికి నెలకు వచ్చే రూ.17 వేల పింఛనుతోనే కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొందని ఎఫ్రాయిమ్‌ వాపోతున్నాడు. ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తే కుమారుడిని కాపాడుకుంటామని తల్లి రూతురాణి వేడుకుంటున్నారు. భర్త కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధతున్నాడని ఆమె వాపోయారు. సాయం చేయదలచిన దాతలు గుంటూరులోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, కరెంట్‌ ఆఫీస్‌ రోడ్డు అనే చిరునామాలో గానీ, 9000980984 ఫోన్‌ నంబర్‌లోగానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 05:15 AM