Deputy CM Pawan: గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:30 AM
రాష్ట్రంలో అత్యంత వెనకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్లను కోరారు.
అక్కడ పాలనా సామర్థ్యం పెంచాలి
కేంద్ర పథకాల అమలులో అల్లూరి, మన్యం భేష్
కలెక్టర్ల భేటీలో డిప్యూటీ సీఎం పవన్ వెల్లడి
అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అత్యంత వెనకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్లను కోరారు. గిరిజన, ఇతర ప్రాంతాల్లో పాలనా సామర్ధ్య పెంపు కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర పథకాల అమలులో అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలు 100 శాతం ఫలితాలు సాధించాయంటూ ఆ జిల్లాల కలెక్టర్లను పవన్ అభినందించారు. నాలుగు వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించామని, 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు రూ.4,330 కోట్ల మేర ఎంజీ నరేగా ఉపాధి వేతనాలు చెల్లించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయార్జనపై దృష్టి సారించామని పవన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించామన్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథం మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు. కలెక్టర్లు ప్రజలకు నిబద్ధతతో సేవలందించాలని పవ న్ సూచించారు.