Share News

విందులపైనే ధ్యాస..!

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:34 PM

వ్యవసాయాధికారులకు విందులపై ఉన్న ధ్యాస.. రైతులపై లేదనేది స్పష్టతమవుతోంది.

   విందులపైనే ధ్యాస..!
ఓర్వకల్లులోని ఆర్‌బీకే కేంద్రంలో విందు భోజనం చేస్తున్న డీలర్లు

రైతులను గాలికొదిలేసిన వ్యవసాయాధికారులు

ఆర్‌బీకే భవనంలో డీలర్ల విందు

వ్యవసాయ కార్యాలయానికి తాళం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న

ఓర్వకల్లు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాధికారులకు విందులపై ఉన్న ధ్యాస.. రైతులపై లేదనేది స్పష్టతమవుతోంది. పంటల సాగులో అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి ఆదుకోవాల్సిన వ్యవసాయాధికారులు విందులో మునిగిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓర్వకల్లులోని ఆర్‌బీకే కేంద్రంలో శుక్రవారం ఫర్టిలైజర్స్‌ షాపు యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్స్‌ షాపు యజమానులు అధికారులకు విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, కర్నూలు ఏడీఏ శాలురెడ్డి, ఏవో మధుమతి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన అధికారులు రైతుల సమస్యలపై ఏమీ చర్చించకుండా డీలర్లు పెట్టిన విందులో పాల్గొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైతులకు అవసరమైన ఎరువులు..

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు డీలర్ల వద్ద ఉన్నాయో లేదో తెలపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలా కాకుండా ఆర్‌బీకే భవనంలో డీలర్లు సమకూర్చిన విందు భోజనాన్ని అరగించి వారు చేస్తున్న అక్రమా లను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ మాత్రం తనిఖీలు చేయకుండా రైతుల సమస్యలు తెలుసుకోకుండా అధికారులు వెనుదిర గడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌బీకేలో సమావేశం..

ఆర్‌బీకేలో సమావేశం నిర్వహించడం, వ్యవసాయ కార్యాలయానికి తాళం వేయడంతో రైతులు ఆకార్యాలయానికి వచ్చి వెనుదిరిగిపోయారు. జిల్లావ్యాప్తంగా నకిలీ ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు విచ్చలవిడిగా డీలర్లు విక్రయిస్తున్నా ఈ సందర్బాల్లో డీలర్లు పెట్టిన విందు భోజనంలో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొనడంపై ఏమిటని రైతులు చర్చించుకుంటున్నారు. ఈవిషయంపై జిల్లా అధికారులు స్పందించా ల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:34 PM