AP Government: అభివృద్ధి, సంక్షేమం సుపరిపాలన
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:25 AM
రాష్ట్రంలో చాలా ఆశాజనకమైన ప్లాన్ పెట్టుకున్నాం. అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టించాలి. 7.5 శాతంగా ఉన్న గ్రోత్ రేటును 15 శాతానికి తీసుకెళ్లాలి..
మా ఫోకస్ పాయింట్లు. సంపద సృష్టించాలి. ఆ సంపదతో సంక్షేమాన్ని అందరికీ వర్తింపచేయాలి. సంక్షేమం చివరి మైలురాయు వరకు చేరుకోవాలి. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. పీపీపీ విధానంలో రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, హార్బర్లు, పరిశ్రమలు, ఇతర ప్రాజెక్టులు వస్తాయి. పెట్టుబడులు పెట్టే వ్యక్తికి ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనీ, తమకు ఏ సమస్యా ఉండదన్న భరోసా మనం ఇవ్వాలి.’’ -
- చంద్రబాబు
15% వృద్ధిరేటే ప్రభుత్వ లక్ష్యం
3 నెలల్లో గొప్ప మార్పు కనిపించాలి: చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో చాలా ఆశాజనకమైన ప్లాన్ పెట్టుకున్నాం. అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టించాలి. 7.5 శాతంగా ఉన్న గ్రోత్ రేటును 15 శాతానికి తీసుకెళ్లాలి. వీలైనమేరకు ఉద్యోగాలను సృష్టించాలి. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండాలి. సుపరిపాలన సాధనకు ఇవే మా లక్ష్యాలు. వీటిని సీరియ్‌సగా తీసుకొని పనిచేయండి’’ అని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. అనంత రం చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. కలెక్టర్లు తమ శక్తిసామర్థ్యాలతో వీలైనన్ని ఉద్యోగాలు సృష్టించాలని, దీనివల్ల సమాజంలో సంతృప్తిస్థాయి పెరుగుతుందని చెప్పారు. అదే జరిగితే శాంతిభద్రతలు కూడా అదుపులో ఉంటాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ‘వ్యాధులు, రోగాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. ఈ రంగంపై ఖర్చు కనీసం 30శాతం తగ్గితే అనేక మార్పులు వస్తాయి. ఆరోగ్యరంగంలో ‘సంజీవని’ గేమ్‌చేంజర్ కానుంది’’ అని అన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం రానున్నరోజుల్లో పెరగనుందని, పోలీసులు కూడా తమ ఆఫీసుల్లో సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంకా ఏమన్నారంటే..
టెక్నాలజీయే గేమ్ చేంజర్
‘‘ప్రభుత్వం, అధికారుల పనితీరుకు సంబంధించిన ప్రగతి నివేదికలను ప్రతి సోమవారం రెండున్నర గంటలపాటు పరిశీలిస్తాను. మీరు కూడా అన్ని రకాల డేటాను దగ్గరపెట్టుకొని పరిశీలన చేయండి. హార్ట్‌వర్క్ కాదు..స్మార్ట్ వర్క్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీనే గేమ్ చేంజర్. దాన్ని సాధ్యమైనంత మేరకు వాడుకొని ఫలితాలు పొందండి.’’
యంగ్‌టీమ్‌తో తొలిసారి పనిచేస్తున్నా
‘‘గతంలో డీజీపీ, సీఎస్, ఆ స్థాయి సీనియర్ అధికారులతో పనిచేశాను. కానీ ఈ సారి యంగ్ టీమ్‌తో పనిచేస్తున్నాను. ఇప్పుడు యంగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్ అధికారులతో మాట్లాడుతున్నా. కిందిస్థాయిలో వారిని కూడా గైడ్‌చేయగలిగితే వారు మరింత గొప్ప వనరుగా మారగలరని నమ్మకం. అందుకే వారితో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. ఇప్పుడున్న యంగ్ ఐఏఎ్‌సలు 2055 వరకు పనిచేస్తారు. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుంది. జాతి నిర్మాణంలో గొప్పగా పాల్గొనాలి. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీల బదిలీలతో సరైన పోస్టుకు సరైన అధికారిని ఎంపిక చేసే విధానం అమలు చేశాం. త్వరలో జరిగే బదిలీల్లో కూడా ఇదే విధానం.’’
ఇది అద్భుతమైన మీటింగ్
‘‘కలెక్టర్ల సమావేశం అద్భుతమైన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీలది బెస్ట్ టీమ్. అనుకున్న ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం కుదిరింది. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను సీరియ్‌సగా తీసుకొని పనిచేయండి. వచ్చే మూడు నెలల్లో క్వాంటమ్‌చేంజ్ కనిపించాలి. మనం మళ్లీ కలిసేలోపల గణనీయంగా శాంతిభద్రతలు మెరుగవ్వాలి.’’
నెహ్రూ ఓ ఫ్యూడల్: సీఎం
‘‘సింగపూర్, భారత్‌కు కొద్ది సంవత్సరాల వ్యత్యాసంలో స్వాతంత్య్రం వచ్చింది. సింగపూర్ ట్రేడ్‌యూనియర్ నేత లీక్ లీ కాన్ పోటీదారీ ఆర్ధిక విధానాలు ఆచరించారు. సింగపూర్‌ను అభివృద్ధి చేశారు. మనదేశంలో నెహ్రూ ఫ్యూడల్ (భూస్వామి). ఆయనకు బాగా డబ్బులున్నాయి. ఆయన సోషలిస్టు విధానాల కారణంగా 1947 నుంచి 1991 వరకు సింగపూర్‌తో మనం పోటీపడలేకపోయాం. ఆర్థిక సంస్కరణలు వచ్చాకే ముందుకు రాగలిగాం. ప్రధాని మోదీ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్నాం. మూడోస్థానానికి త్వరలో వస్తాం. 2038లో రెండో పెద్ద ఎకానమీగా ఎదుగుతాం.’’