River Overflow: వరదలో చిక్కి విలవిల
ABN , Publish Date - Oct 30 , 2025 | 06:40 AM
ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరం సమీపంలో ముసి వాగు పరీవాహక ప్రాంతంలో 121 మంది కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న సహా రెవెన్యూ...
‘ముసి’లో చిక్కుకున్న 121 మంది కూలీలు
కొండపి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరం సమీపంలో ముసి వాగు పరీవాహక ప్రాంతంలో 121 మంది కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న సహా రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం నుంచీ తీవ్ర ప్రయత్నాలు చేసి.. రాత్రి 10 గంటల సమయానికి సురక్షితంగా తీసుకొచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 121 మంది కూలీలు పొగాకు నారుమడుల్లో పనులకు వచ్చారు. వారంతా ముసికి సమీపంలో తాత్కాలిక గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. మంగళవారం అధికారులు వారి వద్దకు వెళ్లి చోడవరం జడ్పీ స్కూల్‌లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి రావాలని కోరారు. అయితే, తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పి అందరూ అక్కడే ఉండిపోయారు. మధ్యాహ్నానికి ముసిలో నీటి ఉధృతి పెరిగి.. చోడవరం వద్ద నల్లవాగు కూడా పొంగింది. దీంతో కూలీలు తాము ఆపదలో ఉన్నామని, రక్షించాలని సమాచారం ఇచ్చారు. దీంతో సింగాయకొండ నుంచి బోట్లు రప్పించి వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.
గుండ్లకమ్మలో చిక్కుకున్న మున్సిపల్ సిబ్బంది
అద్దంకి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి మంచినీటి సరఫరా చేసే ఊటబావుల పంపింగ్ స్కీమ్ వద్ద విధులు నిర్వహించే ముగ్గురు సిబ్బంది బుధవారం గుండ్లకమ్మ వరదలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు జాలర్లు మున్సిపల్ సిబ్బందిని పడవ మీద ఎక్కించుకొని వస్తుండగా బోల్తాపడింది. దీంతో ఆరుగురు వరదలో చిక్కుకుపోయారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విషయాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయానికి మరో మత్సకారుడు కుమార్ ధైర్యం చేసి పడవలో వారున్న చోటుకు వెళ్లాడు. ఆరుసార్లు వెళ్లి ఆరుగురినీ క్షేమంగా తీసుకొచ్చాడు. కుమార్ ధైర్యానికి కలెక్టర్ మెచ్చి రివార్డు ప్రకటించారు. మరోవైపు అద్దంకి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వనపర్తి హనుమంతరావు(80), రేక్‌నార్ లక్ష్మి(55) తుఫాన్ చలిగాలులకు తట్టుకోలేక మంగళవారం రాత్రి మృతిచెందారు.
వాగులో చిక్కుకున్న ట్రావెల్ బస్సు
కురిచేడు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ట్రావెల్స్ బస్సు వాగులో చిక్కుకోవడంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు వణికిపోయారు. భయంతో కేకలు, హాహాకారాలు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలో వెంగాయపాలెంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. సకాలంలో పోలీసులు స్పందించి వారిని రక్షించడంతో కథ సుఖాంతమైంది. వివరాలివీ.. మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి భారీవర్షం కురిసి.. వెంగాయపాలెం సమీపంలో ఉన్న వాగు పొంగింది. హైదరాబాద్ నుంచి పామూరుకు 30మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు వాగులో మధ్యలోకి వచ్చేసరికి అధిక నీటి ప్రవాహానికి ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. వాగులో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో మరింత ఆందోళన చెందారు. వారి కేకలు విని స్థానికులు కురిచేడు ఎస్‌ఐ శివకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే సిబ్బందితో ఘటనా స్థలికి వచ్చారు. స్థానికులనూ అప్రమత్తం చేశారు. నడుముల్లోతు నీటిలో దిగి బస్సు వద్దకు వెళ్లి ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. ట్రాక్టర్‌ను పిలిపించి తాళ్లు కట్టి బస్సును బయటకు తీయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్రాక్టర్‌పై.. రెండు వాగులు దాటి..
గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలిసి సహాయం అందజేసేందుకు గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా ట్రాక్టర్‌లో ప్రయాణించారు. తీవ్రత తగ్గాక బుధవారం ఉదయం ఆమె పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. ఆ సమయంలో వరగాని వద్ద నక్కలవాగు, మేకలవాగును దాటి అవతలికి ఆమె కారు వెళ్లలేని పరిస్థితి. అయినా ఆమె ట్రాక్టర్‌పై కూర్చుని ఆ రెండు వాగులను దాటి అవతలికి వెళ్లి నీట మునిగిన పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు నివేదించారు. యూరియా లభ్యత తక్కువగా ఉందన్నారు. కలెక్టర్ స్పందించి పంటలను రక్షించి రైతులకు అండగా ఉండాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రానికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పి తనే స్వయంగా భోజనం వడ్డించారు.
11 గంటలు చెట్టుపైనే
పొన్నలూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన నూతలపాటి కోటయ్య మంగళవారం నెల్లూరు జిల్లా కందుకూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. రాత్రి 8 గంటల సమయంలో పొన్నలూరు-ఉప్పలదిన్నె వెళ్లే రోడ్డులో గొరిసెలేరు వాగు దాటేందుకు ప్రయత్నించి అందులో పడిపోయాడు. కొద్దిదూరం కొట్టుకుపోయాక వేపచెట్టును పట్టుకున్నాడు. దానిపైకి ఎక్కి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్నవారిని చూసి పెద్దగా కేకలు వేశాడు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి.. డ్రోన్‌తో రోప్‌వేను కోటయ్యకు అందించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
వెలిగొండ సొరంగాల్లోకి వరద
పెద్ద దోర్నాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి వరద నీరు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ద్వారా సొరంగాలను ముంచెత్తింది. దీంతో లోపల పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై వెంటనే వారిని కొల్లంవాగు వైపు తీసుకెళ్లి బోటు ద్వారా 200 మందిని శ్రీశైలానికి తరలించారు. మరో 150మంది కార్మికులు అక్కడి శిబిరాలలోనే ఉన్నారు.

ఎక్స్‌కవేటర్‌పై గర్భిణి
బొల్లాపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం పేరూరుపాడుకు చెందిన చిలకాబత్తిని జ్యోతికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్థులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే వాగు ఉధృతికి వాహనం వచ్చే పరిస్థితి లేదు. అధికారులు వెంటనే స్పందించి ఎక్స్‌కవేటర్‌ను రప్పించి, ఆమెను వాగు దాటించారు. 108లో వినుకొండ ఆస్పత్రికి తరలించారు.
