Kolleru Lake Floods: లంక గ్రామాలు బిక్కుబిక్కు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:56 AM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి కాలువలు, డ్రెయిన్ల ద్వారా వరద నీరు కొల్లేరులోకి భారీగా చేరుతుండటంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలూరు జిల్లా మండవల్లి, కైకలూరు మండలాల్లో...
కొల్లేరులో గంటగంటకూ పెరుగుతున్న వరద
ముంపునకు గురైన పెనుమాకలంక రహదారి
గోదావరిలో పెరిగిన నీటిమట్టం
కైకలూరు, పోలవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి కాలువలు, డ్రెయిన్ల ద్వారా వరద నీరు కొల్లేరులోకి భారీగా చేరుతుండటంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలూరు జిల్లా మండవల్లి, కైకలూరు మండలాల్లో కొల్లేరు సరస్సు నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. మరింత పెరిగితే గ్రామాలు సైతం ముంపుబారిన పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండవల్లి మండలం పెద్దయడ్లగాడి నుంచి పెనుమాకలంకకు వెళ్లే రహదారి ముంపుబారిన పడింది. ఇంగిలిపాకలంక, పెనుమాకలంక, నందిగామలంక గ్రామస్థులు నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దయడ్లగాడి, చిన్నయడ్లగాడి వంతెనల వద్ద దట్టంగా గుర్రపుడెక్క, తూడు, కిక్కిసకర్ర అలుముకోవడంతో ఈ గ్రామాలకు మరింత ముంపు పొంచి ఉంది. కైకలూరు మండలంలో అటపాక పక్షుల కేంద్రం వద్ద కొల్లేరులోకి ఉధృతంగా వరద నీరు చేరుతోంది. ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామానికి వెళ్లేందుకు పోల్‌రాజ్ డ్రెయిన్‌పై ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామస్థులు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. సర్కారు కాలువ వద్ద కూడా కొల్లేరులో వరద నీరు పెరుగుతోంది.
సంద్రంలోకి 4 లక్షల క్యూసెక్కుల జలాలు
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం భద్రాచలం వద్ద నీటిమట్టం 29.40 అడుగులకు చేరింది. ఉపనదులతో పాటు కొండవాగుల నుం చి వస్తున్న జలాలతో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 4,03,425 క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.