వరద ముప్పు!
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:18 AM
కృష్ణానదికి వరద పోటెత్తింది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ నుంచి 4.43 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శుక్రవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటికే ఒకటో నెంబరు ప్రమాదహెచ్చరిక అమలులో ఉన్నట్లు చెబుతున్నారు. పులిగడ్డ ఆక్విడెక్టు వద్ద వరదనీటి ప్రవాహం క్రమేపి పెరుగుతోంది. దీంతో లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది.
- లంక గ్రామాలు విలవిల
- ప్రకాశం బ్యారేజీ నుంచి 4.37 లక్షల క్యూసెక్కుల రాక
- శుక్రవారానికి వరద మరింతగా పెరిగే అవకాశం
- అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ బాలాజీ
- కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కృష్ణానదికి వరద పోటెత్తింది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ నుంచి 4.43 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శుక్రవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటికే ఒకటో నెంబరు ప్రమాదహెచ్చరిక అమలులో ఉన్నట్లు చెబుతున్నారు. పులిగడ్డ ఆక్విడెక్టు వద్ద వరదనీటి ప్రవాహం క్రమేపి పెరుగుతోంది. దీంతో లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీ వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ కడలివైపు పరుగులు తీస్తోంది.
జిల్లాలో భారీ వర్షం
జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నందివాడలో అత్యధికంగా 52.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అవనిగడ్డలో 6.2 మిలీట్లమీటర్లు వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 24.0 మిల్లీమీటర్లుగా నమోదైంది. గురువారం ఉదయం 8.30 గంటల వరకు కోడూరులో అత్యధికంగా 61.4 మిల్టీమీటర్లు, అత్యల్పంగా నందివాడలో 16.8 మిల్లీమీటర్లు, జిల్లా సగటు వర్షపాతం 36.09 మిల్లీమీటర్లుగా నమోదైంది. సెప్టెంబరు 1వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ బాలజీ
కృష్ణానదికి పెద్దఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం ఎప్పటికపుడు అంచనా వేస్తోందన్నారు. కృష్ణానది తీరం వెంబడి మండలాల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. తోట్లవల్లూరు మండలంలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో అక్కడ రక్షణ చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. వరద పరిస్థితులను ఎప్పటికపుడు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో 08672-252572 నెంబరుతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. బుడమేరు పరివాహక ప్రాంతంలోనూ గత రెండు రోజులుగా వర్షపాతం అధికంగా నమోదైందని తెలిపారు. బుడమేరుకు గతేడాది ఏర్పడిన వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వరద ఉధృతి పెరిగితే లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఆర్డీవోలను ఆయా మండలాలకు పంపి వరద ఉధృతిని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు లంక గ్రామాల్లో పంటలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అవనిగడ్డ మండలంలోని యడ్లంక గ్రామానికి వెళ్లే కాజ్‌వే వరదనీటి ప్రవాహం కారణంగా మరింతగా కోతకు గురవుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బృందం ఈ కాజ్‌వేను గురువారం పరిశీలించిందని తెలిపారు. ఈ బృందం సభ్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం తరుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.