Share News

Flood Diversion Operations: ఎక్కడికక్కడ వరద మళ్లింపు

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:19 AM

కృష్ణా జలాల యాజమాన్య నిర్వహణలో గత ఏడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

Flood Diversion Operations: ఎక్కడికక్కడ వరద మళ్లింపు

  • గత ఏడాది అనుభవాల రీత్యా ముందే అప్రమత్తం

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల యాజమాన్య నిర్వహణలో గత ఏడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన జలాశయాల్లోకి ఎగువ నుంచి వస్తున్న వరదను ఎక్కడికక్కడ మళ్లిస్తూ.. ప్రవాహవేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. పులిచింతల నుంచి వేగంగా వస్తున్న వరదను ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తద్వారా బ్యారేజీపైనా .. విజయవాడ లోతట్టు ప్రాంతాలపైనా వరద ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బ్యారేజీలోకి ఇసుక మరబోట్లు రాకుండా నిరంతర గస్తీ చేపడుతున్నారు. గత ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి జలాలు బయటకు వెళ్లకుండా అడ్డు పడేలా ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు కుట్ర పన్ని .. మరపడవలను వరుసగా వదిలిన విషయం తెలిసిందే. జల వనరుల శాఖ బుడమేరు వరద నియంత్రణ చర్యలనూ చేపడుతోంది. ఈ కాలువ విస్తీర్ణం 17,500 నుంచి 35,500 క్యూసెక్కులకు పెంచుతూ ప్రణాళికలు సిద్ధం చేసే పనిని ఏపీజెన్కోకు అప్పగించింది. దీనిపై జల వనరులు, జెన్కో ఉన్నతాధికారులతో ఆ శాఖ ప్రత్యేక సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ వెలగపూడి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జెన్కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, డైరెక్టర్‌ సుజయ్‌, కృష్ణా డెల్టా సీఈ రాంబాబు, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్‌ ఇంజనీరు సుగుణాకరరావు పాల్గొన్నారు. బుడమేరు విస్తరణ బాధ్యతలను జెన్కోకు సాయిప్రసాద్‌ అప్పగించారు.

పక్కా ప్రణాళికతో...

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లోకి వస్తున్న ఎగువ వరద ప్రవాహం నియంత్రణలోనే ఉన్నదని రాష్ట్ర జల వనరుల శాఖ చెబుతోంది. ఆలమట్టి నుంచి క్రమంగా వరద ప్రవాహం తగ్గుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌, అక్కడ నుంచి పులిచింతల, ప్రకాశంబ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఈ వరదనంతటినీ వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి వదలేస్తున్నారు. ఎక్కడికక్కడ నీటి యాజమాన్య నిర్వహణ చర్యలను జల వనరుల శాఖ చేస్తోంది.

Updated Date - Aug 20 , 2025 | 05:20 AM