Heavy Rains: కుమ్మేసిన వాన
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:26 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ దక్షిణ కోస్తా...
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లాలో నేడూ విద్యాసంస్థలకు సెలవు
కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూముల ఏర్పాటుకు ఆదేశం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూడా వర్షాలు కురిశాయి.
నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. నెల్లూరు నగరంలో రోడ్లపై నీరు ప్రవహిస్తుండగా, ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ నీటిని బయటకు పంపుతున్నారు. ఈ జిల్లాలోని 957.4 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. గురువారం కూడా జిల్లాలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని 15 మండలాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. శ్రీకాళహస్తిలో అత్యధికంగా 18.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో స్వర్ణముఖి, కైవల్య, అరుణా నదులతోపాటు వాగులు, జలపాతాలూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏర్పేడు మండలం జంగాలపల్లి చెరువుకు గండి పడింది. రోడ్డు కొట్టుకుపోవడం, బ్రిడి ్జలు, కాజ్‌వేలపైకి నీరు చేరడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి జిల్లావ్యాప్తంగా 19 మార్గాల్లో 44 ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. భారీ వర్షాలతో పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటించారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శేషాచలం కొండల నుంచీ వచ్చే కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణవనం మండలం కైలాసనాధ కోన వద్ద జలపాతం, పుత్తూరు మండలం మూలకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మూలకోన జలపాతానికి సందర్శకులు రాకుండా ఎకో టూరిజం చెక్‌పోస్టు మూసివేశారు. తిరుమలలో ముసురుతో చలితీవ్రత పెరిగింది. ముందస్తు జాగ్రత్తగా శ్రీవారిపాదాలు, పాపవినాశనం మార్గాలను టీటీడీ మంగళవారం రాత్రే మూసివేసింది. బుధవారం కూడా భక్తులను అనుమతించలేదు. రెండవఘాట్‌రోడ్డులో ఒక చెట్టు రోడ్డుమీదకు వాలిపోవడంతో సిబ్బంది తొలగించారు. వానలతో శేషాచలం కొండల్లో జలపాతాలు దూకుతున్నాయి. మరోవైపు పొగమంచు శేషాచలాన్ని కప్పేస్తోంది. ప్రకాశం జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొత్తపట్నం, ఒంగోలు అర్బన్, రూరల్, సింగరాయకొండ మండలాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలో ప్రధాన వీధులన్ని చెరువులను తలపించగా శివారు కాలనీలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో పొలంలో కలుపుతీత పనులకు వెళ్లిన ఇద్దరు మహిళా కూలీలు పిడుగుపాటుకు మృతి చెందగా మరో మహిళా కూలి తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వలపర్ల కమలమ్మ అలియాస్ మరియమ్మ(45), షేక్ ముజాహిదా(50)గా గుర్తించార. నీలం మాణిక్యమ్మకు గాయాలవడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఏలూరు జిల్లాలోనూ పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.శ్రీకాళహస్తిలో 18.4, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 14.5, దుత్తలూరులో 11.7 మి.మీ, కందుకూరులో 10.8, అనంతసాగరంలో 10.3, మర్రిపాడులో 8.9, మొగిలిచర్లలో 7.9, కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో 7.5, ప్రకాశం జిల్లా ఉమ్మారెడ్డిపల్లెలో 6.2, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
నేడు మరో అల్పపీడనం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని కొన్ని మోడళ్లు, ఈనెల 25వ తేదీ తర్వాత ఏర్పడుతుందని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో తుఫాన్లకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు/వాయుగుండాలు ఏర్పడుతున్నాయని ఐఎండీ పేర్కొంది.
కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి
తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులను అందుబాటులో ఉంచాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాత్రి అనకాపల్లి కలెక్టరేట్ నుంచి అల్పపీడన ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటుచేసి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆకస్మిక వరదలపై అప్రమత్తం: డిప్యూటీ సీఎం పవన్
రాష్ట్రంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. డ్రైనేజీలు, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలన్నారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
నేడూ భారీ, అతిభారీ వర్షాలు..
తీవ్ర అల్పపీడనం గురువారం దక్షిణ కోస్తాలో తీరం దాటి పశ్చిమంగా పయనించి అరేబియా సముద్రంలోని వాయుగుండంలో విలీనమవుతుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీగా, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ల వద్దని సూచించారు.