Share News

Anantapur: ఐదేళ్ల చిన్నారి హత్య

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:23 AM

ఐదేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. భార్య తన నుంచి దూరం కావడానికి కారణమైందంటూ... మరో మహిళ కుమారుడిని దారుణంగా చంపేశాడు.

Anantapur: ఐదేళ్ల చిన్నారి హత్య

  • గొంతు నులిమి చంపిన పొరుగింటి వ్యక్తి

  • బాలుడి తల్లిపై కోపంతో దారుణం

అనంతపురం క్రైం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. భార్య తన నుంచి దూరం కావడానికి కారణమైందంటూ... మరో మహిళ కుమారుడిని దారుణంగా చంపేశాడు. అనంతపురం నగరంలోని అరుణోదయ కాలనీలో నివాసం ఉంటున్న గోవిందహరి, నాగవేణి దంపతుల కుమారుడు నాగ సుశాంత్‌ (5)ను పక్కింట్లో ఉంటున్న ఆటో డ్రైవర్‌ పెన్నయ్య దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 25న అర్ధరాత్రి గోవింద హరి దంపతులు సుశాంత్‌ నిద్రపోతుండగా ఇంట్లోనే వదిలేసి టిఫిన్‌ కోసం ఆర్టీసీ బస్టాండుకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి చూసేసరికి బాబు ఇంట్లో కనిపించలేదు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆదివారం అనంతపురం త్రీట్రౌన్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవింద హరి ఇంటి సమీపంలో పెన్నయ్య, సావిత్రి దంపతులు నివాసం ఉంటున్నారు. సావిత్రి, నాగవేణి స్నేహితులు. సావిత్రి భర్తతో గొడవ పడినపుడు నాగవేణి వారి ఇంటికి వెళ్లేది. తన భార్య సావిత్రికి లేనిపోనివి చెప్పి.. తమ మధ్య మనస్పర్ధలు పెరిగేలా చేసిందని పెన్నయ్య.. నాగవేణిపై పగ పెంచుకున్నాడు. ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి బాబును ఇంట్లో ఉంచి నాగవేణి దంపతులు బయటకు వెళ్లడం గమనించాడు. బాబును ఎత్తుకెళ్లి గొంతు నులిమి చంపి గోనె సంచిలో చుట్టి దోబీ ఘాట్‌లోకి విసిరేశాడు. పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగు చూసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 06:24 AM