CM Chandrababu: ఐదేళ్లలో 7 లక్షల కోట్ల జీఎస్డీపీ నష్టం
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:59 AM
రాష్ట్ర విభజనకంటే ఐదేళ్ల వైసీపీ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన: సీఎం
విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం
పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్లు చెల్లింపు
బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు
వ్యవస్థలను తిరిగి మేం గాడిలో పెడుతున్నాం
కూటమి విధానాల ఫలితమే జీఎస్డీపీలో వృద్ధి
2025-26 రెండో త్రైమాసికంలో 11.28శాతం వృద్ధి
ఆర్థిక సంవత్సరం చివరికి 17.11శాతం వృద్ధే లక్ష్యం
ప్రతి త్రైమాసికాన్నీ పర్యవేక్షిస్తున్నాం
పరిశ్రమలు, సాగు, సేవా రంగాల్లో పురోగతి
గణాంకాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కక్ష పూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పీపీఏలను వైసీపీ రద్దు చేయడంతో ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా వాడుకోకుండానే రాష్ట్రం రూ.తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. జగన్ ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రజలపై భారం వేయకూడదన్న లక్ష్యంతో విద్యుత్తు చార్జీలను పెంచడం లేదు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని బయటపడేయగలిగాం. మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటినీ త్వరలోనే అధిగమిస్తాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజనకంటే ఐదేళ్ల వైసీపీ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత పాలకుల విధ్వంసం వల్ల వృద్ధి రేటు తగ్గిపోవడంతో ఐదేళ్లలో రూ.ఏడు లక్షల కోట్ల విలువైన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్డీపీ) కోల్పోయామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. ప్రతి త్రైమాసికం, ఆర్థిక సంవత్సరంలో సాధిస్తున్న జీఎస్డీపీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆ వివరాలను తెలుపుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
సోమవారం సచివాలయంలో 2025-26 తొలి అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు), అలాగే రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబరు వరకు) జీఎస్డీపీ ఫలితాలను సీఎం విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.28 శాతంగా నమోదు కాగా, గత ఏడాది ఇదే సమయంలో అది 10.17 శాతంగా నమోదైంది. 18 నెలలుగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే 1.11 శాతం వృద్ధి పెరిగింది. ఇదే సమయానికి జాతీయస్థాయిలో జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతంగా నమోదైంది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేయడమే లక్షం’’ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రెండో త్రైమాసికంలో రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్డీపీ నమోదైందని, ఇందులో వరి 3.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, గతంతో పోలిస్తే 23.95 శాతం మేర వృద్ధి నమోదైందని తెలిపారు. అరటిలో అనూహ్యంగా 37.31 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని, గతంతో పోలిస్తే ఇది 151.2 శాతం అధికమని వివరించారు. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 21.55 లక్షలు జరిగాయని, జలరవాణా ద్వారా 52.50 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగిందని, విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 14.98 లక్షలకు చేరుకున్నదని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
బ్రాండ్ పోవడంతో చాలా నష్టపోయాం..
‘‘విభజన కారణంగా వ్యవస్థీకృతంగా ఏపీకి ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులను సరిచేసే సమయంలో వైసీపీ వచ్చి రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం వల్ల ప్రజాధనానికి నష్టం కలిగింది. ఇప్పుడిప్పుడే వ్యవస్థలను గాడిలో పెట్టి ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలు రీషెడ్యూలింగ్ చేసుకోవాలని చూస్తున్నాం. బ్రాండ్ ఇమేజ్ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతుంది. దాని ఫలితంగా రాష్ట్రం చాలా నష్టపోయింది.’’
హామీలన్నీ అమలు చేస్తున్నాం
‘‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. చేయలేమని మేం పారిపోవడం లేదు. అదేసమయంలో అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టేలా చేస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని చేస్తాం. కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీ స్థాయిలో ప్రజలు మద్దతు పలికారు. గత పాలకులు ఆస్తులను, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. కూటమి అధికారంలోకి వచ్చాకే వాటిని ముందుకు తీసుకెళ్లగలిగాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచాం. సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లాం. డీఫంక్ట్ (పనికిరాని స్థితిలోని) అయిన వివిధ కేంద్ర పథకాలను పునరుద్ధరించాం. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ పునరుద్ధరించగలిగాం. వైసీపీ హయాంలో పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తును యూనిట్‌కు రూ.15 చొప్పున కొనుగోలు చేసిన పరిస్థితి. మేం ఆ పరిస్థితిని మార్చాం. గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడం వల్ల విద్యుత్ వాడుకోకుండానే రూ.9వేల కోట్లు చెల్లించింది. అన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రజలపై భారం వేయకూడదన్న లక్ష్యంతో విద్యుత్ చార్జీలను పెంచలేదు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించాం. రూ.13 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నాం. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిన ఘనత గత పాలకులది. దాన్ని తొలగించేందుకు జనవరి1 గడువుగా విధించాం. డిమాండ్ ఉన్న పంటలతోపాటు పంటల నాణ్యతపైనా రైతులు దృష్టి పెట్టాలి. రైతు సేవా కేంద్రాల వారీగా వ్యవసాయ యాక్షన్ ప్లాన్లు తయారు చేస్తున్నాం. ప్రకాశం, ఎనిమిది రాయలసీమ జిల్లాలను ఉద్యానవన క్లస్టర్‌గా తయారు చేస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.
తొలి అర్ధ సంవత్సరం ఫలితాలు...
ప్రస్తుత ధరల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం జీఎస్డీపీ రూ.7,58,270 కోట్లు. వ్యవసాయరంగంలో 10.26 శాతం వృద్ధి నమోదైంది. పరిశ్రమల రంగంలో 12.05 శాతం, సేవల రంగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం లక్ష్యంలో తొలి రెండు త్రైమాసికాలు కలిపి 41 శాతం జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకున్నాం. రానున్న రెండు త్రైమాసికాలు కలిపి జీఎస్డీపీ రూ.11,07,434 కోట్ల సాధనే లక్ష్యం.
తప్పులు చేస్తారు.. తప్పులు చేసిన వారిని సమర్థిస్తారు
ఇదే వైసీపీ నాయకుల నైజం: సీఎం
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘తప్పులు చేస్తారు.. తప్పులు చేసిన వారిని సమర్థిస్తారు. ఇలాంటి వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ పార్టీకి తలాతోక లేదు. ప్రతీ అంశంలో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడమే వారి పని. పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరంగా పేర్కొనేవారిని ఏమనాలి?’’ అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఓ దేవాలయంలో దేవుడి సొమ్ము చోరీ చేస్తే తక్షణం అతన్ని సస్పెండ్ చేసి, అరెస్టు చేయించామన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుడి సొమ్ము చోరీ చేస్తే దాన్ని సమర్థిస్తారా అంటూ వైసీపీ అధినేత జగన్‌ను నిలదీశారు. రోజుకు లక్ష మంది భక్తులు వచ్చే దేవుడితో ఆటలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాసిరకం అన్న ప్రసాదాలను భక్తులకు ఇస్తే దాన్ని సమర్థించారని, కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేస్తే, ఆ ఘటనను కూడా వెనకేసుకొస్తున్నారని, ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు. ‘రూ.70వేలు చోరీ చేశాను.. రూ.14 కోట్లు రాసిచ్చాను’ అని అంటే తప్పు ఒప్పు అవుతుందా? సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కించేసి, ఆయన భార్యతో మాపై ఆరోపణలు చేయించారు. హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో ఓ పాస్టర్ మరణిస్తే, ఆ ఘటనను కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఈ క్రిమినల్స్ మమ్మల్ని గోబెల్స్ అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. కరెంటు చార్జీలు పెంచబోమన్న మాటకు కట్టుబడటం గోబెల్స్ ప్రచారం చేయడమా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పీపీఏల రద్దు చేసిన కారణంగా ఉత్త పుణ్యానికి ప్రజాధనం రూ.9వేల కోట్లు దుర్వినియోగం చేశారని చెప్పడం గోబెల్స్ ప్రచారమా అని సీఎం నిలదీశారు.