Road Accident: మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెళుతూ..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:14 AM
నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ‘తుఫాన్’
మృతుల్లో మూడేళ్ల చిన్నారి.. మృతులంతా పల్నాడు జిల్లా వాసులు
ఉలవపాడు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. కుమారుడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమలకు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం ముందు వెళుతున్న లారీని అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడు గ్రామానికి చెందిన నంబుల వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతుల కుమారుడు అభిరామ్(3)కు శ్రీవారి సన్నిధానంలో పుట్టు వెంట్రుకలు తీసేందుకు 11 మంది కుటుంబసభ్యులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు. ఉలవపాడు సమీపంలో చాగొల్లు వద్ద తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని అధిగమించే ప్రయత్నంలో వీరి వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నరసమ్మ (55), సుభాషిణి (30) అక్కడికక్కడే మృతిచెందారు. అభిరామ్, రుక్మిణి, ఎర్రం శ్రీనివాసరావు (60) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కావలిలో చికిత్స పొందుతూ అభిరామ్ మృతిచెందాడు. రుక్మిణి, శ్రీనివాసరావులు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు.