Chilakaluripeta: ఐదుగురిని మింగేసిన అతివేగం
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:57 AM
మితిమీరిన వేగం ఐదుగురిని మింగేసింది! పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం పరిధిలోని జాతీయ రహదారి-16పై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మృతులు విజ్ఞాన్ ఇంజనీరింగ్ విద్యార్థులు
ఇందులో అయ్యప్ప దీక్షలో ఉన్న నలుగురు
కంటెయినర్‌ను ఓవర్ టేక్ చేస్తూ మృత్యువొడికి..
చిలకలూరిపేట, నాదెండ్ల, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మితిమీరిన వేగం ఐదుగురిని మింగేసింది! పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం పరిధిలోని జాతీయ రహదారి-16పై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విజ్ఞాన్ వర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మెడిగం రామిరెడ్డి, వినుకొండ మండలం శివాపురానికి చెందిన మేరుగు శ్రీకాంత్, పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి మహే్‌షబాబు, వినుకొండకు చెందిన వంగవోలు వాసు, మూలకలూరు చెందిన యశ్వంత్ సాయి ఉన్నారు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వీరంతా 21 ఏళ్లలోపువారే. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా తీవ్ర గాయపడిన వాసును ఆస్పతికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుల్లో నలుగురు విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. రెండు రోజుల్లో అయప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి వీరందరూ కారులో వినుకొండ ప్రాంతంలోని ఓ దేవాలయంలో నిద్ర చేసేందుకు రాత్రి 8.30 గంటల సమయంలో చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో వెళ్తూండగా.. కంటెయినర్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు.