MLC Election: ఐదు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవం!
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:10 AM
ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఐదు స్థానాలకు కూటమి పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

5 స్థానాలకు ఐదుగురి నామినేషన్లు
టీడీపీ నుంచి నాయుడు, రవిచంద్ర, గ్రీష్మ
బీజేపీ తరఫున సోము వీర్రాజు దాఖలు
జనసేన నుంచి ముందే నాగబాబు నామినేషన్
ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు
ఆ తర్వాతే ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన
జనసేన నుంచి ఇప్పటికే వేసిన నాగబాబు
అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఐదు స్థానాలకు కూటమి పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన నుంచి కె.నాగబాబు ఇప్పటికే దాఖలు చేయగా.. టీడీపీ తరఫున బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ.. బీజేపీ నుంచి సోము వీర్రాజు సోమవారం వేశారు. మంగళవారం వాటిని పరిశీలిస్తారు. సాంకేతికంగా నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉండడంతో ఆ తర్వాత వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఉదయం ముగ్గురు టీడీపీ అభ్యర్థులు తొలుత అసెంబ్లీలోని మంత్రి లోకేశ్ చాంబరుకు చేరుకుని.. ఆయనతో కలిసి అసెంబ్లీ కమిటీ హాలుకు వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దరఖాస్తును టీడీఎల్పీ కార్యాలయంలోనే పూర్తి చేసి తీసుకెళ్లారు. వీర్రాజును బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు బలపరిచారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బాబుతో కలిసి పని చేస్తా: సోము
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు మాట్లాడుతూ... ‘రెండో సారి ఎమ్మెల్సీగా నా ఎంపికకు కేంద్ర పార్టీ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు. ఆయన ఆధ్వర్యంలో కలిసి పని చేస్తా. ఏపీలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది’ అని అన్నారు.
బడుగుల భగవంతుడు బాబు: బీటీ
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు మాట్లాడుతూ... ‘బలహీన వర్గాలకు చెందిన ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవకాశం రావడం చిన్న విషయం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను వైసీపీ ఓటు బ్యాంకుగానే చూసింది. అధికారం, విధులు, నిధులు లేని కుర్చీలకే పరిమితం చేసింది. బలహీన వర్గాలకు చెందిన మాకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు బడుగుల భగవంతుడు’ అని అన్నారు.
నమ్మకంగా పని చేస్తాం: బీద
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ... ‘బడుగు వర్గాలకు చెందిన మమ్మల్ని పెద్దల సభకు పంపుతున్న సీఎం చంద్రబాబు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ప్రజా సమస్యలపై మండలిలో మాట్లాడతాం. నాకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ఽకృతజ్ఞతలు’ అని అన్నారు.
మంచి పేరు తెచ్చుకుంటా: గ్రీష్మ
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మ మాట్లాడుతూ... ‘ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నమ్మకాన్ని నిలుపుకుంటా. నా తల్లి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతిలా మంచి పేరు తెచ్చుకుంటా. వైసీపీలో రోజా, నాని లాంటి వారు బూతులు మాట్లాడితే పదవులు ఇచ్చారు. కానీ టీడీపీ మాత్రం ఒక సిద్ధాంతంతో పనిచేస్తోంది’ అని అన్నారు.
అభ్యర్థుల ఆస్తుల వివరాలు..
బీద ఆస్తులు రూ.41 కోట్లు..
బీద రవిచంద్ర, ఆయన భార్య, కుమార్తె పేరుతో ఉన్న చరాస్తుల విలువ రూ.23.46 కోట్లు. స్థిరాస్తులు రూ.17.63 కోట్లు.. వెరసి రూ.41 కోట్ల విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయి. రవిచంద్ర పేరుతో ఎలాంటి వాహనాలూ లేవు. ఆయన సతీమణి, కుమార్తె పేరుతో ఉన్నాయి. ఆయన సతీమణికి రూ.37 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉండగా కుమార్తె పేరుతో రూ.5 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీరి కుటుంబానికి రూ.10.83 కోట్ల అప్పులు ఉన్నాయి.
బీటీ నాయుడు ఆస్తి 5.68 కోట్లు
బీటీ నాయుడు, ఆయన సతీమణి పేరుతో చరాస్తులు రూ.2.58 కోట్లు ఉండగా, స్థిరాస్తుల విలువ రూ.3.10 కోట్లు. ఆయన పేరుతో కారు ఉంది. ఇద్దరికీ కలిపి 450 గ్రాముల బంగారం ఉంది. అప్పులు రూ.59 లక్షలు. ఈయనపై మొత్తం నాలుగు పోలీసు కేసులు ఉన్నాయి.
గ్రీష్మ ఆస్తి రూ.1.78 కోట్లు..
కావలి గ్రీష్మ తన పేరుతో గానీ, తన భర్త పేరుతో గానీ ఎలాంటి వాహనాలూ లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె వద్ద 40 కేరట్ల వజ్రాలు, 440 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండగా.. 20 కేజీల వెండి.. ఆమె భర్త వద్ద 220 గ్రాముల బంగారం ఉంది. వీరి మొత్తం చరాస్తుల విలువ రూ.1.33 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.45 లక్షలు. అప్పులు రూ.94.54 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు.
వీర్రాజు ఆస్తి 2.81 కోట్లు..
సోము వీర్రాజు పేరుతో ఉన్న చరాస్తుల విలువ రూ.57.37 లక్షలు. స్థిరాస్తుల రూపంలో రూ.2.24 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అప్పులు రూ.50.14 లక్షలు ఉన్నాయి
నాగబాబు ఆస్తి రూ.70.32 కోట్లు
నాగబాబు పేరుతో చరాస్తులు రూ.59.12 కోట్లు, స్థిరాస్తులు రూ.11.20 కోట్లు.. అప్పులు రూ.1.64 కోట్లు ఉన్నాయి. తన అన్న చిరంజీవి నుంచి రూ.28.48 లక్షలు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ.6.90 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు చూపారు.