Vishakhapatnam: ప్రభుత్వ ఆస్పత్రిలో తొలి కాలేయ మార్పిడి
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:54 AM
ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌్‌స (విమ్స్) ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వేదికైంది.

విమ్స్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అభినందనలు
విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం నమోదైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌్‌స (విమ్స్) ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వేదికైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆ వ్యక్తి బ్రెయిడ్ డెడ్ అయినట్టు నిర్ధారించిన వైద్యులు.. కుటుంబ సభ్యులతో అవయవదానానికి ఒప్పించారు. నిబంధనల ప్రకారం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్న రోగులకు ఆయా అవయవాలను అందించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి కాలేయాన్ని..
11 నెలలుగా సంబంధిత సమస్యతో బాధపడుతూ విమ్స్‌లో చికిత్స పొందుతున్న 40 ఏళ్ల వ్యక్తికి జీవన్‌దాన్ అధికారులు కేటాయించారు. విమ్స్ వైద్యులు ఈ నెల 3న కాలేయమార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఆవ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ‘విమ్స్’ డైరెక్టర్ కె.రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా విమ్స్ నిలవడం ఆనందంగా ఉందన్నారు. విమ్స్ వైద్య బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అభినందించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ మోహన్‌వంశీ, డాక్టర్ స్రవంతి, డాక్టర్ పృథ్వీ, నవీన్‌చంద్, హరికృష్ణ పాల్గొన్నారు.