CM Chandrababu: మూడేళ్లలో రాజధాని తొలి దశ
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:54 AM
అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనినీ మూడేళ్లలో పూర్తి చేస్తాం. ప్రధాని మోదీతో వాటిని ప్రారంభింపజేస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది అనే అంశంపై ....
ప్రతి పనీ పూర్తిచేస్తాం.. ప్రధానితో ప్రారంభింపజేస్తాం: చంద్రబాబు
అమరావతి అభివృద్ధిని పరిమితం చేస్తే చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది
మహానగరంలా మలచాలంటే గుంటూరు,విజయవాడ, తెనాలిని కలుపుకొని వెళ్లాలి
అమరావతిలో ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వం.. వారితో మాట్లాడే విస్తరణకు భూములు తీసుకుంటాం
విమర్శలకు భయపడితే అభివృద్ధి జరగదు
జనవరికల్లా అమరావతిలో క్వాంటమ్ మిషన్
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
భావితరాల కోసమే విజన్-2047
2028-29నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.5.42 లక్షలుగా చేయాలని లక్ష్యం
2033-34కి రూ.10.55 లక్షలు చేయాలి
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తే సాధిస్తాం
మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం లేదు
బనకచర్లకు వృఽథా జలాలే వాడుకుంటాం
మీడియా సంస్థ కాంక్లేవ్‌లో సీఎం స్పష్టీకరణ
అమరావతి అభివృద్ధి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. ఆ అభివృద్ధిని కొంతవరకే పరిమితం చేస్తే అమరావతి చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో ఇది కూడా మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే గుంటూరు, విజయవాడ, తెనాలిని కలుపుకొంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది.బనకచర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బుతో కంపెనీలు పెడుతున్నాయా..? బ్యాంకుల నుంచి తీసుకుని కంపెనీలు పెట్టి సంపాదించి, తర్వాత వాటిని కట్టేస్తున్నారు. బనకచర్ల విషయంలోనూ అలాగే చేస్తాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనినీ మూడేళ్లలో పూర్తి చేస్తాం. ప్రధాని మోదీతో వాటిని ప్రారంభింపజేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘రానున్న దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది’ అనే అంశంపై ఓ మీడియా సంస్థ శుక్రవారం మంగళగిరిలో నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అమరావతిలో రూ.50వేల కోట్లపైచిలుకు విలువైన మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయని, వాటన్నింటినీ మూడేళ్లలో పూర్తిచేసి తీరతామని తెలిపారు. అమరావతి అభివృద్ధి అనేది హైదరాబాద్ తరహాలో నిరంతరం సాగుతూనే ఉంటుందని తెలిపారు.
రాజధానిలో క్వాంటమ్ మిషన్ వచ్చే జనవరి నాటికి వస్తుందని తెలిపారు. పోలవరం ఇప్పటికే పూర్తికావలసిన ప్రాజెక్టని, 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2021కే పూర్తయి ఉండేదని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ వాటన్నింటినీ బాగు చేసుకుంటూ నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నామని, 2027 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని.. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏడాదిలో పూర్తి చేశామని, హంద్రీ-నీవా కాలువల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరిచ్చామని గుర్తుచేశారు. ఆయన ఏమన్నారంటే..
రాజధానికి భూములిచ్చినవారిని ఆదుకుంటాం..
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ రాకముందు ఆ ప్రాంతంలో ఎకరం లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు అక్కడ ఎకరం రూ.100 కోట్లుకు చేరింది. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది. అమరావతిలో మొత్తం ప్రైవేటు భూములే. ఒక్క రైతుకూ అన్యా యం జరగనివ్వం. రాజధానికి భూములిచ్చిన వారిని ఆదుకుంటాం. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది. అమరావతి విస్తరణ విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం. రైతులతో మాట్లాడి విస్తరణకు భూములు అవసరమైన మేరకు తీసుకుంటాం. విమర్శలకు భయపడి ఆగిపోతే అభివృద్ధి జరగదు. రాజధాని విస్తరణకు రైతులు సహకరిస్తున్నారు. వారి సహకారంతో దేశం లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కొన్ని ఇప్పటికే వచ్చాయి. ఇంకొన్ని రాబోతున్నాయి.
అభివృద్ధి సాధనకు విజన్ ఉండాలి
అభివృద్ధి సాధించాలంటే దానికి విజన్ ఉండాలి. భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి.. విజన్‌కు రూపకల్పన చేసుకుని దానిని సాధ్యం చేసే దిశగా పనిచేయాలి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజన్-2020కి రూపకల్పన చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర-2047కు రూపకల్పన చేసుకుని ముందుకెళ్తున్నాం. భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో నాటి ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహరావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి దేశాభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా సాగుతోంది. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత.. ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని 4వ ఆర్థికవ్యవస్థగా తీసుకొచ్చారు. 2028కి మూడో అతిపెద్ద ఎకానమీగా, 2038కి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందనడంలో అనుమానం లేదు. 2047కి నంబర్‌వన్ ఆర్థికవ్యవస్థగా నిలవాలన్నది నా ఆకాంక్ష. 2024-25లో ఎన్ని కష్టాలు ఉన్నా 12 శాతం వృద్ధిరేటు సాధించాం. 2028-29 నాటికి జీఎస్డీపీ రూ.29 లక్షల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం ఉన్నదాని కంటే ఇది రెట్టింపు. ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోకి ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువ. ప్రస్తుతం రూ.2.66 లక్షలుగా ఉంది. దీన్ని 2028-29 నాటికి రూ.5.42 లక్షలుగా చేయాలని, 2033-34 నాటికి రూ.10.55 లక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. ఇదేమీ అసాధ్యం కాదు. నిర్దిష్ట ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకెళ్తే తేలిగ్గా లక్ష్యాన్ని సాధించగలం. శరీరానికి షోషకాలెంత అవసరమో సమాజానికి మంచి పాలసీలూ అంతే అవసరం.
ఏమీ లేకపోయినా పర్వాలేదంటే ఎలా?
విమర్శలకు, ఖర్చుకు వెనకాడితే ప్రాజెక్టులు పూర్తికావు. ఒకప్పుడు రాయలసీమలో పదేళ్లలో ఎనిమిదేళ్లు కరువుండేది. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం. కానీ ఇప్పుడు నీరివ్వడంతో పరిస్థితి మారింది. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో ముందుంది. హార్టీకల్చర్ సాగు వల్లే ఇది సాధ్యమైంది. నీళ్లు లేకపోయినా పర్వాలేదు.. రోడ్లు లేకపోయినా పర్వాలేదంటే మనం ఇక్కడే ఉంటాం. బనకచర్ల ప్రాజెక్టుకు సముద్రంలోకి పోయే వృధా వరద జలాలను మాత్రమే వినియోగించుకుంటాం. పెద్ద కలలు కనాలి.. సంకల్పం ఉండాలి. అప్పుడే ఏదైనా సాధ్యం. 1995లో నేను ఉమ్మడి ఏపీ సీఎం అయినప్పుడు మూడు నెలలు జీతాలు ఇవ్వలేకపోయాను. సంక్షేమ కార్యక్రమాలనూ అమలు చేయలేకపోయాం. ఆ సమయంలో ఐటీపై దృష్టి పెట్టాం. ఐటీ వల్లే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది. అదే చిత్తశుద్ధితో ఇప్పుడు కష్టపడుతున్నాం. 15 రోజులకోసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. 15 రోజులకోసారి ఎస్‌ఐపీబీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం.
మళ్లీ వచ్చేది ఎన్‌డీఏనే
ప్రపంచంలో వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం 11 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం, సుస్థిర నాయకత్వం ఉంది. దేశంలో.. రాష్ట్రంలో మరోసారి కూడా ఎన్‌డీఏనే వస్తుంది. ఇందులో అనుమానం లేదు.
భూమి ఇస్తే మెడికల్ కాలేజీ కట్టినట్లేనా?
మెడికల్ కళాశాలకు భూమి మాత్రమే ఇచ్చి నిర్మాణం పూర్తి చేశామని కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. ఐదేళ్లలో ఐదు కాలేజీలు కూడా పూర్తి చేయలేకపోయారు. అందుకే పీపీపీ విధానంలో వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టాం. కాలేజీలను ఎక్కడా ప్రైవేటుకు అప్పగించడం లేదు. వైద్యవిద్యార్థులకు, వైద్యసేవలకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వల్ల నష్టం ఉండదు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు రైతు కూలీల పిల్లలు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు.
సమాంతరంగా సంక్షేమం.. అభివృద్ధి
భారత్‌లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాలి. ఎన్నికలు ఐదేళ్లకు వస్తాయి.. దానికి తగ్గట్టే పనిచేద్దాం.. రాజకీయంగా లబ్ధి పొందుదామనుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు. విద్యుత్ సంస్కరణలు తెచ్చేవాడిని కాదు. సీఎంగా భావితరాల కోసం ఆలోచించాలి. 2004లో నన్ను ఎవరూ ఓడించలేదు. ఆరోజు తపనతో ఏదో చేసేయాలని ఆలోచించి సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్తున్నాను. సూపర్ సిక్స్ హామీలు అమలుచేస్తూనే అభివృద్ధి చేస్తున్నాను. పీ-4 ద్వారా పేదరికం లేని సమాజంతోపాటు ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు శ్రమిస్తున్నాం. ఏటా సంక్షేమ పథకాలపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా.. సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అలాగే పీపీపీ మోడల్‌ను ప్రపంచమంతా ఆమోదించింది. దీని ద్వారా సంపద సృష్టించి పేదలకు పంచుతాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నాం. దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వస్తే 1995లో నేను ధైర్యంగా వాటిని అందిపుచ్చుకుని అమలు చేశాను. దావోస్ వెళ్లి సంస్కరణల గురించి వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించాను. సంపద సృష్టించకపోతే అభివృద్ధి అసాధ్యం. ఒకప్పుడు ఒక ప్రాజెక్టుపై రూ.50 కోట్లు ఖర్చు చేస్తే గొప్ప ప్రాజెక్టు. ఇప్పుడు రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు కడుతున్నాం.