Share News

Konaseema: బాణసంచా పేలుడుకు ఏడుగురు బలి

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:45 AM

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ విస్ఫోటనం సంభవించింది.

 Konaseema: బాణసంచా పేలుడుకు ఏడుగురు బలి

  • కోనసీమ జిల్లా రాయవరంలో విషాదం.. మృతుల్లో తయారీ కేంద్రం యజమాని

  • దీపావళి ఆర్డర్ల కోసం పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి పేలుళ్లు

  • ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం

  • చికిత్స పొందుతూ మరో కూలీ మృతి

  • మృతుల్లో నలుగురు మహిళా కూలీలూ..

  • బాధాకరం: మోదీ.. ఆదుకుంటాం: పవన్‌

అమలాపురం/మండపేట/రాయవరం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ విస్ఫోటనం సంభవించింది. దీపావళి ఆర్డర్ల కోసం పనిచేస్తున్న ఏడుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. పండగ దగ్గర పడటంతో తానే దగ్గరుండి పనులు చేయిస్తున్న యజమాని సైతం ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటనం ధాటికి తయారీ కేంద్రంలోని గోడ కూలిపోయింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని గృహాలు కంపించిపోయాయి. వివరాల్లోకి వెళితే.. రాయవరం శివారు ప్రాంతంలో తొమ్మిది దశాబ్దాలుగా శ్రీలక్ష్మీగణపతి గ్రాండ్‌ ఫైర్‌వర్క్స్‌ పేరుతో బాణసంచా తయారీ కేంద్రం నడుస్తోంది. వివిధ జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి నుంచి దీపావళి సామగ్రి తరలిస్తుంటారు. ఎప్పుడూ 40 మందికి పైగానే కూలీలు పనిచేస్తుంటారు. అయితే, మధ్యాహ్నం భోజన విరామ సమయం కావడంతో చాలామంది భోజనానికి వెళ్లారు. దీంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి అలియాస్‌ సత్తిబాబు పర్యవేక్షణలో ప్రమాద సమయంలో ఏడుగురు పని చేస్తున్నారు.


ప్రమాదంపై భిన్న కథనాలు..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చిచ్చుబుడ్డు తయారుచేసి శాంపిల్‌గా దానిని వెలిగించారు. అది మండిన వెంటనే నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. తయారీ కేంద్రంలోనే స్టాకు పాయింట్‌ కూడా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. మంటలు అలుముకోగానే.. లోపలకు వెళ్లి సరుకును బయటకు తీసుకువచ్చేందుకు చేసే ప్రయత్నంలో సత్తిబాబు సజీవ దహనమైనట్టు సమాచారం. కాగా, ప్రమాదంపై పోలీసుల కథనం భిన్నంగా ఉంది. చిచ్చుబుడ్డి తయారీ కోసం మందు కూరుతుండగా ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయని ఏలూరు రేంజ్‌ డీఐజీ అకోశ్‌కుమార్‌ తెలిపారు. కాగా, మృతులను సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ (33), అనపర్తి సావరానికి చెందిన చిట్టూరి శ్యామల (38), కుడుపూడి జ్యోతి (38), అనపర్తి గ్రామానికి చెందిన పెంకే శేషారత్నం(35), ఒడిశాకు చెందిన కె.సదానందం (50)గా వీరిని గుర్తించారు. బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన పట్నూరి వెంకటరమణ (50) కాకినాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.


వంటిపై గుర్తుల ఆధారంగా..

మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలి బూడదయ్యాయి. దీంతో వంటిపై గుర్తుల ఆధారంగా మృతదేహాలను గుర్తించాల్సి వచ్చింది. చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా యజమాని సత్తిబాబు మృతదేహాన్ని గుర్తించారు. కాగా, తీవ్రంగా గాయపడిన నలుగురికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. విస్ఫోటనానికి కారణాలను విశ్లేషించేందుకు అమరావతి నుంచి ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణుల బృందం వస్తోందని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా తెలిపారు.

పరిస్థితి సమీక్షించిన హోం మంత్రి

బాణసంచా పేలుడు సమాచారం తెలిసిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించారు. మొత్తం ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారని తెలిపారు.15రోజుల కిందటే సిబ్బంది ఈ కేంద్రంలో తనిఖీలుచేసి సంతృప్తి వ్యక్తంచేశారన్నారు.

చర్యలు చేపట్టాలి : పవన్‌ కల్యాణ్‌

బాణసంచా పేలుడు ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. బాణసంచా కేంద్రాల్లో, గోదాముల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బాధాకరం: ప్రధాని

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో బాణసంచా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘‘ బాణసంచా తయారుచేస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చోటుచేసుకోవడం బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి’’ అని ‘ఎక్స్‌’లో ఆకాంక్షించారు.

Updated Date - Oct 09 , 2025 | 03:46 AM