Share News

Fire Department: ఫైర్‌కు పైత్యం

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:37 AM

అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైరన్‌ మోగిస్తూ వేగంగా వచ్చే ఫైరింజన్లు వయసు మళ్లి కదల్లేకపోతున్నాయి. ఏ మూలకైనా రయ్‌మంటూ చేరుకునే అగ్నిమాపక శకటాలు మొరాయించి మూలకు చేరాయి.

Fire Department: ఫైర్‌కు పైత్యం

  • కేంద్ర, రాష్ట్రాలు నిధులిచ్చినా ఖర్చు చేయని వైనం

  • ఫైరింజన్లు పాతబడినా కొత్తవి కొనని చాదస్తం

  • అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా.. విపత్తుల శాఖ ధైన్యం

  • మొదటి విడత నిధుల్లో పైసా ఖర్చుచేయని పరిస్థితి

  • రెండో విడత నిధులకు పొరుగు రాష్ట్రాల ప్రతిపాదనలు

  • అగ్నిమాపక శాఖలో అంతులేని అలసత్వం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైరన్‌ మోగిస్తూ వేగంగా వచ్చే ఫైరింజన్లు వయసు మళ్లి కదల్లేకపోతున్నాయి. ఏ మూలకైనా రయ్‌మంటూ చేరుకునే అగ్నిమాపక శకటాలు మొరాయించి మూలకు చేరాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిచ్చి ఫైరింజన్లు కొనుక్కోమని చెప్పినా అలసత్వంతో నిధులు మురగ బెట్టేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులది నిర్లక్ష్యమా? లేక చాదస్తమా? అనేది పక్కన బెడితే.. వరదలు సంభవిస్తే సహాయ చర్యలకు అక్కడికి చేరుకునేందుకు ఫైరింజన్లు కదలవు. కొనుగోలు చేయాల్సిన బోట్లు కొనలేదు. ఆఖరికి సిబ్బందికి బూట్లు కూడా లేవు. అన్నింటా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలుపుతామని పదే పదే చెబుతోన్న కూటమి ప్రభుత్వంలో పది నెలల క్రితం నిధులు మంజూరైనా ఖర్చు చేయకుండా నాన్చుతున్న అగ్నిమాపక శాఖ అధికారుల పనితీరుతో అది ఎలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అనే సామెతను వీరి అలసత్వం గుర్తు చేస్తోంది.


ఆధునికీకరణకు రూ.252 కోట్లిచ్చినా..

రాష్ట్రంలో ప్రస్తుతం 230 ఫైరింజన్లు ఉండగా, వాటిలో 60శాతానికిపైగా పదిహేనేళ్లు పైబడినవే. దీంతో వాటికి ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేది లేదని రవాణా శాఖ అధికారులు ఆర్నెల్ల క్రితమే స్పష్టం చేశారు. వాటిలో 75 వాహనాలు గుజిరీకి వేయాల్సిందేనని తేల్చిచెప్పడంతో అగ్నిమాపక శాఖ ఆ పనిని పూర్తి చేసింది. అదే సమయంలో రూ.252 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.189 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.63 కోట్లు భరించాల్సి ఉంది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వమూ సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 125 అత్యాధునిక ఫైరింజన్లు కొనుగోలు చేసుకుని, 17 చోట్ల ఫైర్‌ స్టేషన్లు నిర్మించుకోవాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగ్గా అగ్నిమాపక సేవలు అందించడానికి ఫైర్‌ ఫైటింగ్‌ అత్యాధునిక పరికరాలు సమకూర్చుకోవడం, దూళపల్లిలో శిక్షణకేంద్రాన్ని మెరుగుపరచుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకోసం మొదటి విడతగా కేంద్రం రూ.58 కోట్లు విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.17కోట్లు గతేడాది ఆగస్టులోనే విడుదల చేసింది. ఆ మొత్తం రూ.75కోట్లతో 125 ఫైరింజన్లు, సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రం గనుక 60 బోట్లు, సిబ్బందికి బూట్లు, ప్రత్యేక రక్షణ సూట్లు కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పదినెలలు పూర్తైనా కనీసం టెండర్లు పిలవకపోవడం వారి పనితీరుకు నిదర్శనం. అలాగే, దక్షిణ భారతంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రాన్ని దూళపల్లిలోని పదిహేను ఎకరాల్లో నిర్మించి జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా పనులు కాగితాలు దాటలేదు.


రూ.500 కోట్ల అదనపు నిధులపై ప్రభావం..

విడతల వారీగా నిధులు మంజూరు చేసే కేంద్ర ప్రభుత్వానికి మొదటి విడత నిధులు ఖర్చు చేసి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌(యూసీ) ఇస్తేనే రెండో దశ నిధులు విడుదలవుతాయి. మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఒడిశా ఇప్పటికే తొలి విడత నిధులు ఖర్చు చేసి యూసీలు ఇచ్చి రెండో విడత ప్రతిపాదనలు కూడా పంపాయి. దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉంటామని చెబుతోన్న మనం ఇప్పటికీ పైసా ఖర్చు చేయకుండా వెనుకబడ్డాం. దీనిపర్యవసానం రాబోయే రోజుల్లో రూ.500కోట్ల అదనపు నిధులపై పడే అవకాశం ఉందని ఆ శాఖ సిబ్బందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 06:37 AM