శ్రీమఠం గోశాల గోడౌనలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:31 PM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల గోడౌనలో సోమవారం అగిప్రమాదం జరిగింది.
దాదాపు 1500 ట్రాక్టర్ల పశుగ్రాసం దగ్ధం
దెబ్బతిన్న గోడౌన
సుమారు రూ.60 లక్షల ఆస్తి నష్టం
మంత్రాలయం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల గోడౌనలో సోమవారం అగిప్రమాదం జరిగింది. విద్యుత షార్ట్ సర్క్యూట్‌తో నిప్పురవ్వలు పశుగ్రాసంపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న సూపర్‌వైజర్ రాఘవేంద్ర దేశాయ్ గోశాల సిబ్బందితో పశువులను మంటలకు దూరంగా తరలించి కాపాడారు. శ్రీమఠం అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్ ఎస్‌కే శ్రీనివాసరావు, ఏఈ బద్రీనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లు, ఆరు ట్రాక్టర్ల ట్యాంకర్లు, నాలుగు ఎక్స్‌కవేటర్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 6 గంటల పాటు మంటలు అదుపు కాలేదు. దీంతో అప్పటికే అందులో ఉన్న దాదాపు 15వేల గ్రాసం చుట్టలు, కర్ణాటక భక్తులు విరాళంగా ఇచ్చిన 15 వేల గ్రాసం చుట్టలు కాలిపోయాయి. విశాలమైన గోడౌన సైతం మంటలకు పూర్తిగా దెబ్బతింది. అధికారులు అప్రమత్తం కావడంతో భారీ నష్టం జరగకుండా చర్యలు చేపట్టడంతో రూ.60 లక్షల నష్టం వాటినట్లు శ్రీమఠం అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు 2వేల గోవులకు ఏడు నెలలకు సరిపోయే గ్రాసం దగ్ధం అయింది.