Share News

Nidhi Bhavan Fire: నిధి భవన్‌లో మంటలు

ABN , Publish Date - May 22 , 2025 | 06:27 AM

ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో మంటలు చెలరేగాయి. 300 మంది ఉద్యోగులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. ఆసన్నంగా జరిగే ఆడిట్‌ నివేదికలు బయటపడకుండా ఉండేందుకే దీని వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Nidhi Bhavan Fire: నిధి భవన్‌లో మంటలు

ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం రెండో అంతస్తులో అగ్నిప్రమాదం

ఆ సమయంలో విధుల్లో 300 మంది

‘మదనపల్లె’ను తలపిస్తున్న ప్రమాదం?

నష్టం పరిమితమే: మంత్రి పయ్యావుల

మంగళగిరి, మే 21(ఆంధ్రజ్యోతి): ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఉద్యోగులు విధులకు హాజరైన కొద్దిసేపటికే రెండో అంతస్తులో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో అప్రమత్తమైన ఉద్యోగులు భయంతో కేకలు వేస్తూ కిందకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సందర్భంలో దాదాపు 300 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. వెంటనే మంగళగిరి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందించడంతో సిబ్బంది నిధి భవన్‌కు చేరుకున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రమాదం ఎక్కడ మొదలైందో తెలుసుకోవడంలో కాస్తంత ఆలస్యమైంది. చివరకు ఎట్టకేలకు మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ సరఫరాను నిలిచివేసి ఉద్యోగులను ఇళ్లకు పంపించివేశారు. పే అండ్‌ అకౌంట్స్‌ యాంటీ రూమ్‌లోని ఫ్రిజ్‌ లేక ఏసీ నుంచి మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. నిధి భవన్‌లో ఫైర్‌ సేఫ్టీ లేకపోవడంవల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


కార్యాలయంలోని కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైళ్లు, ఉద్యోగుల జీతభత్యాల బిల్లులు, వివిధ శాఖలకు సంబంధించిన బిల్లుల ఫైళ్లు కాలిపోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆర్థికశాఖలో కీలకమైన ఖజానా, వర్క్‌ అకౌంట్స్‌, పే అండ్‌ అకౌంట్స్‌, స్టేట్‌ ఆడిట్‌, ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌, ఏపీజీఎల్‌ఐ విభాగాలు ఉన్న నిధి భవన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. కాగా, నిధి భవన్‌ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను నిధి భవన్‌, అగ్నిమాపక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ‘‘అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఉద్యోగులు కిందకు వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో నష్టం పరిమితంగానే ఉంది. ఇప్పటికే క్లూస్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలను సేకరించారు.’’ అని మంత్రి తెలిపారు.


అనుమానాలెన్నో...

అగ్నిప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదృచ్ఛికమా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రమాదాన్ని తలపించేలా ఈ ఘటన ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. త్వరలో వాటికి సంబంధించిన ఆడిట్‌ జరగనుంది. అవి బయట పడకుండా ఉండేందుకే ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించారా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 06:27 AM