Palnadu District: బయోడీజిల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:49 AM
బయోడీజిల్ ప్లాంట్‌లో అగ్నికీలలు ఎగిసిపడి ఓ వ్యక్తి అగ్నికి ఆహుతి కాగా, మరో వ్యక్తి మంటల్లో కాలి ప్రాణాలతో బయట పడ్డాడు.
మంటల్లో చిక్కుకుని వ్యక్తి మృతి... మరొకరికి గాయాలు
రెంటచింతల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బయోడీజిల్ ప్లాంట్‌లో అగ్నికీలలు ఎగిసిపడి ఓ వ్యక్తి అగ్నికి ఆహుతి కాగా, మరో వ్యక్తి మంటల్లో కాలి ప్రాణాలతో బయట పడ్డాడు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయిజంక్షన్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురజాలకు చెందిన షేక్ షరీఫ్ అలియాస్ శివయ్య తన లారీలకు బయోడీజిల్ నింపడానికి రహదారి పక్కన ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఒకటిన్నర నెల నుంచి ఆ ప్లాంట్ మూతపడింది. మళ్లీ బయో డీజిల్ షాపు తెరవాలనుకున్నారు. శనివారం రాత్రి నల్గొండ జిల్లా కోదాడ నుంచి బయోడీజిల్ లోడ్ లారీ రాగా, తన సమీప బంఽధువైన షేక్ రషీద్ (29)ను ప్లాంట్ వద్దకు వెళ్లాలని కోరారు. రషీద్‌కు తోడుగా భాగ్యరావు అనే వ్యక్తి కూడా వెళ్లి విద్యుత్ మోటార్ ద్వారా తెల్లబ్యారల్స్‌లో బయోడీజిల్‌ను నింపుతున్నారు. ఈ సమయంలో మోటార్ ఆగిపోవడంతో భాగ్యరావు స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేశాడు. సమీపంలో ఇన్వర్టులుండడంతో ఒక్కసారిగా చిటపట అంటూ నిప్పురవ్వలు పడి డీజిల్‌కు అంటుకుంది. మంటలు చెలరేగి గాయాలపాలైన భాగ్యరావు తప్పించుకుని బయటకు రాగా బ్యారన్ల దగ్గర ఉన్న రషీద్ బయటపడే మార్గం లేక అగ్నికీలల్లో మాడి మసైపోయాడు. ఒళ్లంతా పూర్తిగా కాలిపోగా కొద్ది పాటి అస్తిపంజరానికి సంబంధించిన ఎముకుల గూడు మాత్రమే ఘటనా స్థలంలో లభ్యమైంది. మాచర్ల నుంచి వచ్చిన అగ్నిమాపక యంత్రం మంటలను ఆర్పడానికి గంట పాటు శ్రమించింది. భాగ్యరావును మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగార్జున చెప్పారు.