Minister Lokesh: వైసీపీ పాలనలో ఆర్థిక ఉగ్రవాదం
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:25 AM
వైసీపీ పాలన కాలంలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టారని మండిపడ్డారు.
కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు.. పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేశారు
రాష్ట్ర పరువు కూడా పోగొట్టారు.. వెనకబడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం
పెట్టుబడుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం.. భారీ పరిశ్రమలు వస్తున్నాయ్
10.4 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం: మంత్రి లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలన కాలంలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టారని మండిపడ్డారు. నాటి పాలకుల కారణంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ఆకర్షణకు మెరుగైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి రాష్ట్రాన్ని తెచ్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిపై శాసనమండలిలో మంగళవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘2019లో ప్రభుత్వం మారాక ఆర్థిక ఉగ్రవాదం నడిచింది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, టెర్రరిజం అని జగన్‌ను ఉద్దేశించి ఇన్ఫోసిస్ మాజీ సీఎ్‌ఫవో మోహన్‌దా్‌సపాయ్ అన్నారు. పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఎలా వీక్ అయ్యిందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. అప్పట్లో అమర్‌రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలకా్ట్రనిక్స్, కాండ్యూయెంట్, జాకీ లాంటి సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. ఏకపక్షంగా పీపీఏల రద్దు వల్ల విద్యుత్‌శాఖపై రూ.10వేల కోట్ల భారంపడింది. సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేయడం వల్ల దేశం నష్టపోయింది. అంతేకాదు మన పరువూ పోయింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కివెళ్లిపోయింది.
రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం
గత ప్రభుత్వ ఆర్థిక ఉగ్రవాదంవల్లే రాష్ట్ర ప్రజలు 94శాతం సీట్లు ఇచ్చి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాం. 25 ప్రపంచ స్థాయి పాలసీలు తీసుకువచ్చాం. ఇప్పటికి రూ. 10.4 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం 340 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. మరో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో జూమ్ కాల్ ద్వారా ఆదిత్య మిట్టల్‌ను సంప్రదించి పెట్టుబడులు పెట్టాలని కోరా. ఆ ఫైల్ సీఎం స్వయంగా ప్రధాని వద్దకు తీసుకెళ్లి మూడుసార్లు మాట్లాడారు. నవంబరులో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాం. 2029 నాటికి మొదటి వాణిజ్య ఉత్పత్తి కూడా జరగబోతోంది. బీపీసీఎల్, ఎన్టీపీసీ వంటి భారీ సంస్థలు వస్తున్నాయి. ప్రకాశంలో రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఐటీ ఎలకా్ట్రనిక్స్‌లో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలకా్ట్రనిక్స్, ఐబీఏం క్వాంటమ్ వ్యాలీ వంటివి వస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనంలో రెన్యూ, టాటా పవర్, ప్రీమియర్ ఎనర్జీ, వారీ వస్తున్నాయి.ఐటీ కంపెనీలకు రూపాయికే భూములు ఎందుకు ఇవ్వాలని జగన్ అడుగుతున్నారు. ప్రిజనరీకి, విజనరీకి తేడా ఉంటుంది. టీసీఎస్ విశాఖలో ప్రత్యక్షంగా 25 వేల ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇంకోనెల ఆగితే మరో కంపెనీ వస్తుంది. మా లక్ష్యం విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన. మేం సింగపూర్ వెళ్తే.. ఏపీలో త్వరలో ప్రభుత్వం మారిపోతోందని పెట్టుబడులు పెట్టవద్దని వైసీపీ నేతలు ఈ మెయిల్స్ పెట్టే పరిస్థితికి దిగజారారు. గత 4నెలల్లో ఏపీ జీడీపీ బారీగా పెరిగింది. 2.4ట్రిలియన్ డాలర్ ఎకానమీ మా లక్ష్యం. ఇందుకు 15ు వృద్ధిరేటు రావాలి. దీనికోసం అహర్నిశలు కష్టపడుతున్నాం’’ అని అన్నారు.
ఫీజు బకాయిలపై చర్చకు సిద్ధమా?
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మంగళవారం శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సభ ప్రారంభం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయినా వైసీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ‘ఇంత సీరియస్ విషయమైతే బీఏసీలో పెట్టాలి. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4వేల కోట్ల బకాయులు పెట్టారు. మళ్లీ వాళ్లే బకాయిల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1,200కోట్లు విడుదల చేశాం. పెండింగ్‌లో ఉన్న రూ.1,400కోట్లు వచ్చే 3నెలల్లో విడుదల చేస్తాం. రూ.4వేల కోట్లు బకాయి పెట్టిపోయిన మీరు.. ఇప్పుడు బకాయిల గురించి మాట్లాడితే ఎలా?’ అంటూ మండిపడ్డారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక వాదులాట ఏమిటంటూ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ‘మీ హయాంలో బకాయిలు పెట్టినందునే ఎజెండాలోకి తేలేదు. చర్చ జరగాలనుకుంటే.. చైర్మన్‌తో మాట్లాడి ఎజెండాలో పెట్టి ఉంటే.. సమాధానం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. గత సమావేశాల్లో విద్యా రంగంపై చర్చ పెడితే బహిష్కరించారు. ఇప్పుడైనా సరైనా ఫార్మాట్‌లో వస్తే.. చర్చకు నేను సిద్ధంగా ఉన్నా’ అని లోకేశ్ స్పష్టం చేశారు.